చెరువులను పరిరక్షించటంతో పాటు పునరుద్ధరణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. శుక్రవారం నగరంలోని పలు చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హైడ్రా మొదటివిడతగా చేపట్టిన 6 చెరువులను హైడ్రా కమిషన్ సందర్శించారు. ఇందులో సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువులు ఉన్నాయి. వీటిలో జరుగుతున్న పనుల పురోగతిపై రంగనాథ్ ఆరా తీశారు. స్థానికులతో మాట్లాడి చెరువుల పునరుద్ధరణ పనులకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ…. నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ బాధ్యతను హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని గుర్తు చేశారు. మిగతా ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఈ పనులను చేపడుతున్నట్లు వివరించారు.
స్థానికుల నుంచి కూడా మంచి సహకారం అందడం ఆనందించదగ్గ విషయమని… త్వరలోనే చెరువుల్లో జీవకళ అందరూ చూస్తారని రంగనాథ్ చెప్పారు. చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ కింద సహాయం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే నివాసాలున్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, సుందరీకరణ పనుల్లో ఎక్కడా నివాసాలను తొలగించమని రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణతో స్థానికంగా ఉండే ప్రాంతాలన్నీ ప్రాధాన్యతను సంతరించుకుంటాయని పేర్కొన్నారు.
దాదాపు రూ. 58.50 కోట్లతో సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, రాజేంద్రనగర్ లోని భమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువు, బతుకమ్మ కుంట చెరువులను మొదటి విడతగా హైడ్రా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చెరువులలో డీ వాటరింగ్ పనులను హైడ్రా చేపట్టింది.
ముందుగా చెరువుల్లో వున్న వ్యర్థ జలాలను బయటకు పంపి.. డ్రై చేస్తున్నారు. వివిధ దశల్లో జరుగుతున్న పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. వచ్చే జూన్ నాటికి ఈ చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో హైడ్రా ముందుకెళ్తోంది. నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు సంబంధించి విమోస్ టెక్నోక్రాట్స్ రూపొందించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు), కాన్సెప్ట్‌లను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు.
సంబంధిత కథనం