'బతుకుమ్మ కుంట పనుల్లో వేగం పెంచండి... త్వరలోనే సీఎం వస్తారు' - హైడ్రా కమిషనర్ ఆదేశాలు-hydraa commissioner has ordered to speed up the work on the bathukamma kunta development works ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'బతుకుమ్మ కుంట పనుల్లో వేగం పెంచండి... త్వరలోనే సీఎం వస్తారు' - హైడ్రా కమిషనర్ ఆదేశాలు

'బతుకుమ్మ కుంట పనుల్లో వేగం పెంచండి... త్వరలోనే సీఎం వస్తారు' - హైడ్రా కమిషనర్ ఆదేశాలు

బ‌తుక‌మ్మ కుంట ప‌నుల్లో వేగాన్ని పెంచాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి… అభివృద్ధి పనులను పరిశీలిస్తారని చెప్పారు. వ‌చ్చే బ‌తుక‌మ్మ ఉత్స‌వాల నాటికి చెరువు పూర్త‌వ్వాల‌ని స్పష్టం చేశారు.

బతుక‌మ్మ కుంట ప‌నుల పరిశీలన

బ‌తుక‌మ్మ కుంట అభివృద్ధి ప‌నులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచాల‌ని కొద్ది రోజుల్లోనే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి… బ‌తుక‌మ్మ‌ కుంట‌ను సంద‌ర్శించనున్నార‌ని వెల్లడించారు. అప్ప‌టి వ‌ర‌కూ చెరువుకు రూపాన్ని తీసుకురావాల‌న్నారు.

శుక్ర‌వారం బ‌తుక‌మ్మ‌కుంట అభివృద్ధి ప‌నుల‌ను పరిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్… పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ. 7 కోట్ల‌తో ఈ చెరువును అభివృద్ధి చేస్తుండగా…. వేగంగా పనులు పూర్తి కావాలని చెప్పారు. మోకాలు లోతు మ‌ట్టిని తీయ‌గానే చెరువు ఆన‌వాళ్లు క‌నిపించిన బ‌తుక‌మ్మ‌కుంట‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు.

ఆలోపు మొత్తం పనులు పూర్తవ్వాలి - హైడ్రా కమిషనర్

వ‌చ్చే బ‌తుక‌మ్మ ఉత్స‌వాల నాటికి చెరువు పూర్త‌వ్వాల‌ని.. బ‌తుక‌మ్మ ఆట‌లు ఇక్క‌డే ఆడేలా సిద్ధం చేయాల‌ని హైడ్రా కమిషనర్ అధికారుల‌కు సూచించారు. అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టిన కాంట్రాక్ట‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు క‌ల‌గ‌కుండా.. అధికారులు చూడాల‌న్నారు. ఇక్క‌డ అభివృద్ధి ప‌నులు చేప‌ట్టిన నాటి నుంచి స్థానికులు ఎంతో సంబ‌ర ప‌డుతున్నార‌ని.. వారి స‌హ‌కారంతో ప‌నుల్లో వేగాన్ని పెంచాల‌ని సూచించారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్ లెట్ల ద్వ‌ారా వ‌ర్ష‌పు నీరు చేరేలా.. పోయేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఆసుప‌త్రి నిర్మాణంలో ఉల్లంఘనలు - కమిషనర్ ఆగ్రహం:

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని డాక్ట‌ర్‌ శంక‌ర్స్ ఆసుప‌త్రి నిర్మాణంలో నిబంధ‌న‌ల ఉల్ల‌ఘ‌న‌లు జ‌రిగినట్లు హైడ్రాకు పలువురు స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌… శుక్ర‌వారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు.

ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించి.. 4 అంతస్తుల భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు తీసుకుని... సెల్లార్‌తో పాటు.. 6 అంత‌స్తుల‌ను ఎలా నిర్మిస్తార‌ని ఆసుప‌త్రి భ‌వ‌న య‌జ‌మాని డా. శంక‌ర్‌ని క‌మిష‌న‌ర్ ప్ర‌శ్నించారు. అనుమ‌తులన్నిటినీ ప‌రిశీలించి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అదికారుల‌ను ఆదేశించారు. ఒక‌వైపు 10 అడుగుల దారి.. మ‌రోవైపు 15 అడుగుల దారి ఉన్న‌చోట ఇన్ని అంత‌స్తులు ఎలా నిర్మిస్తార‌ని.. అందుకు అనుమ‌తులు చూపించాల‌ని భ‌వ‌న య‌జ‌మానిని కోరారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఆస్పత్రికి ఎలా లైసెన్స్ మంజూరు చేశారని అధికారులను నిలదీశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.