HYDRAA : మరో కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రా.. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్న రంగనాథ్
HYDRAA : హైడ్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమిషనర్ రంగనాథ్ నేరుగా ప్రజలను కలవాలని డిసైడ్ అయ్యారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు అయ్యింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అటు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
హైడ్రా తొలిసారిగా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జనవరి 6న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తారు. సాధారణ ప్రజలు ఆ రోజున తమ ఫిర్యాదులను నేరుగా కమిషనర్ కు సమర్పించవచ్చు.
వివాదాలు లేకుండా..
ప్రజల ద్వారా అందిన ఫిర్యాదులను చట్టపరమైన వివాదాలు లేకుండా క్రమపద్ధతిలో 10 రోజుల్లో పరిష్కరించనున్నారు. చెరువులు, సరస్సులు, కాలువల ఆక్రమణల ఫిర్యాదులపై ఏజెన్సీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో గ్రివెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక ఠాణా..
ప్రభుత్వం త్వరలో హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిని సంక్రాంతికి ముందు ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై ఆదివారం (జనవరి 5న) జీవో వెలువడే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రివెన్స్ ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించాలని ఏజెన్సీ నిర్ణయించింది. జూలై 2024లో హైడ్రాను ప్రారంభించినప్పటి నుండి.. 5 వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
హైడ్రాలో ఉద్యోగాలు..
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) హైదారాబాద్ నగరంలో.. 970 కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. TNIE లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం.. ఈ ఏజెన్సీ ఒక సంవత్సరం పాటు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించుకోబోతోంది.
కొత్తవారికి బాధ్యతలు..
నీటి వనరులు, పార్కులు, లేఅవుట్లలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు ఉన్న నాలాలను రక్షించడంలో హైడ్రాకు సహాయం చేయడం వీరి బాధ్యత. అంతేకాకుండా అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించడం కూడా ఉంటుంది. హైదరాబాద్‌లోని ఫుట్‌పాత్‌లు, సరస్సులు, ఖాళీ స్థలాలు, పార్కులు మొదలైన వాటిపై ఆక్రమణలను తొలగించడానికి హైడ్రాకు కాంట్రాక్ట్ ఉద్యోగులు సాయం చేయనున్నారు.
వేతనం ఇలా..
TNIE కథనం ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులను ఏడు ప్యాకేజీలుగా విభజిస్తారు. మేనేజర్లకు రెండు, అసిస్టెంట్లకు ఐదు ప్యాకేజీలు ఉంటాయి. వీరి జీతాల కోసం మొత్తం ఖర్చు సంవత్సరానికి రూ. 31.70 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మేనేజర్లకు నెలకు రూ.22,750 జీతం లభించే అవకాశం ఉండగా.. అసిస్టెంట్ నెలవారీ జీతం రూ.19,500గా ఉంటుందని తెలుస్తోంది.