HYDRA : హైడ్రా మరో సంచలన నిర్ణయం..! అనుమతులిచ్చిన అధికారులపై కేసులు..?-hydra is prepared for criminal cases against the officials who gave the permitions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : హైడ్రా మరో సంచలన నిర్ణయం..! అనుమతులిచ్చిన అధికారులపై కేసులు..?

HYDRA : హైడ్రా మరో సంచలన నిర్ణయం..! అనుమతులిచ్చిన అధికారులపై కేసులు..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 29, 2024 09:57 PM IST

హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది.

హైడ్రా కీలక నిర్ణయం
హైడ్రా కీలక నిర్ణయం

అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేషన్ లేదు. చట్టబద్ధత కూడా కల్పించాల్సి ఉంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది.  ఇప్పటికే నగరంలో తన పనిని మొదలుపెట్టిన హైడ్రా… దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది. మరికొందరికి నోటీసులను కూడా జారీ చేసింది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం అక్రమణలకు పాల్పడిన వారు మాత్రమే కాకుండా… అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయటంతో శాఖపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి... ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు విస్తరించి ఉంటుంది.

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి. ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా… చాలాచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్ లు కూడా చర్చకు వస్తున్నాయి.

నిజానికి చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిల్లో కొన్నింటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే.. తాజాగా ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టాడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. ఇప్పుడు వాటిని కూల్చివేయడం చాలా మంది నేతలకు మింగుడు పడటం లేదు.