Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ-hydra excavation unearths historic bathukamma kunta water board confirms natural spring ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ

Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 18, 2025 10:17 PM IST

Hydra Bathukamma Kunta : హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణపై చర్యలు చేపట్టిన హైడ్రా...అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో తవ్వకాలు చేపట్టింది. మోకాలిలోతులో మట్టి తవ్వగానే నీరు పైకి ఉబికి వచ్చింది. అయితే అది డ్రైనేజీ నీరని సోషల్ మీడియాలో ప్రచారం జరగగా, జలమండలి అధికారులు భూగర్భ జలంగా నిర్ణయించారు.

 హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ
హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ

Hydra Bathukamma Kunta : హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటలో పునరుద్దరణ పనులను మొదలుపెట్టింది. మోకాలిలోతు మట్టి తవ్వగానే నీరు ఉబికి పైకివచ్చింది. దీంతో హైడ్రా అధికారులతోపాటు స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. బతుకమ్మకుంట మళ్లీ ప్రాణం పోసుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పుష్పాలతో బతుకమ్మకుంటను స్వాగతించారు. అయితే హైడ్రా తవ్వకాల్లో డ్రైనేజీ పైపులైన్ పగిలి నీరు పైకి వస్తోందని ప్రచారం జరిగింది. జలమండలి అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి, అక్కడ ఎలాంటి పైపులైన్ లేదని, పూర్తిగా భూగర్భ జలమే అని నిర్థారించారు.

బ‌తుక‌మ్మ కుంట బ‌తికే ఉంది. మోకాలు లోతు మ‌ట్టి తీయ‌గానే బిర‌బిరా గంగ‌మ్మ బ‌య‌ట‌కొచ్చింది. ఇక అంతే అక్కడి స్థానికుల‌లో ఆనందం పెల్లుబికింది. బ‌తుక‌మ్మ కుంట కాదు. ఇది తన స్థల‌మంటూ ఇప్పటివ‌ర‌కూ చెప్పిన వారు ఇప్పుడేమంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క‌బ్జాల చెరలో చెరువు ఆన‌వాళ్లను కోల్పోయిన చెరువుకు ప్రాణం పోయ‌మ‌ని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.

ఈ మేర‌కు అక్కడి ముల్ల పొద‌ల‌ను తొల‌గించి, త‌వ్వకాలు చేప‌ట్టిన హైడ్రాకు గంగ‌మ్మ స్వాగ‌తం ప‌లికింది. మంగ‌ళ‌వారం మోకాలు లోతు మ‌ట్టిని తీయ‌గానే గంగ‌మ్మ ఉబికి వ‌చ్చింది. ద‌శాబ్దాలుగా నింపిన మ‌ట్టిని మొత్తం తొల‌గిస్తే చెరువు క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని స్థానికులు చెబుతున్నారు. అయితే బ‌తుక‌మ్మ కుంట స్థలం త‌న‌దంటూ స్థానిక నాయ‌కుడు ఎడ్ల సుధాక‌ర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించ‌గా.. కింది కోర్టుకు వెళ్లాల‌ని హైకోర్టు సూచించింది.

చెరువు చ‌రిత్ర ఇది

బాగ్ అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట ఉంది. అంబ‌ర్‌పేట మండ‌లం, బాగ్అంబ‌ర్‌పేట్‌లోని స‌ర్వే నంబ‌రు 563లో 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎక‌రాల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌ ఉంది. బ‌ఫ‌ర్ జోన్‌తో క‌లిపి మొత్తం వైశాల్యం 16.13 ఎక‌రాల విస్తీర్ణం అని స‌ర్వే అధికారులు తేల్చారు. తాజా స‌ర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవ‌లం 5.15 ఎక‌రాల విస్తీర్ణం మాత్రమే. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎక‌రాల విస్తీర్ణంలోనే బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధరించేందుకు హైడ్రా చ‌ర్యలు చేపట్టింది. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు త‌వ్వాలని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆదేశించారు.

ఒక‌ప్పటి ఎర్రకుంట‌నే.. కాల‌క్రమంలో బ‌తుక‌మ్మ కుంట‌గా మారింద‌ని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి. కాల‌క్రమంలో బ‌తుక‌మ్మకుంట‌లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయ‌డంతో చెరువు ఆన‌వాళ్లు కోల్పోయింద‌ని స్థానికులు అంటున్నారు. చెరువు పునరుద్ధరణ తర్వాత బ‌తుక‌మ్మ కుంట చుట్టూ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టనున్నట్లు హైడ్రా ప్రకటించింది. బ‌తుక‌మ్మ కుంట‌లో నీటితో క‌ళ‌క‌ళ‌లాడితే ప‌రిస‌ర ప్రాంత‌ల్లో ప‌ర్యావ‌ర‌ణం, భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌తో పాటు ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణం ఏర్పడ‌నుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు - హైడ్రా

బతుకమ్మకుంటలో నీరు రాలేదని, అది పైప్ లైన్ అని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తు్న్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హైడ్రా కోరింది. బతుకమ్మ కుంటలో ఎలాంటి డ్రైనేజీ పైపు లైన్లు లేవు అని జలమండలి అధికారులు స్పష్టం చేశారని పేర్కొంది. బతుకమ్మ కుంటలో వేరే చోట తవ్వినా నీళ్లు రావడంతో ఊట నీరుగానే పరిగణించామని తెలిపింది. తవ్వకాల్లో ఊట నీరు వస్తే అది డ్రైనేజ్ లైన్లు పగిలి వచ్చిన మురుగు నీరుగా కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని హైడ్రా కోరింది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం