HYDRA Demolitions : పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు
HYDRA Demolitions in Pocharam : గ్రేటర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు జరిగాయి. దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా తొలగించారు.
పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు జరగాయి. దివ్యనగర్ లేఔట్ ప్లాట్ ఓనర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు… హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయమే ఈ కూల్చివేతలను ప్రారంభించారు.
పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా తొలగించారు. ప్రహరీ కూల్చివేతతో దివ్యనగర్ లేఔట్ ప్లాట్ యజమానులు, ఆ పరిసర ప్రాంతాల్లోని ఇతర లే ఔట్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు.
దివ్యనగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో పలు కాలనీలకు రూట్ క్లియర్ అయింది. ఇందులో ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్‌షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడ కాలనీలు ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీఉన్న దివ్య లేఔట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్లమల్లారెడ్డివిగా ఉన్నాయని స్థానికుల ఆరోపణలు చేశారు. కాలనీలో నెలకొన్న ఇబ్బందులను హైడ్రా దృష్టికి తీసుకెళ్లగా…. తాజాగా చర్యలు చేపట్టారు.
సిద్ధమవుతున్న హైడ్రా పోలీస్ స్టేషన్:
బుద్ధ భవన్ పక్కనే హైడ్రా పోలీసు స్టేషన్ సిద్ధమవుతోంది. హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పోలీసు స్టేషన్ తరహాలోనే లోపల గదులు, కేబిన్ల నిర్మాణాలు వుండేలా చూస్తున్నారు.
స్టేషన్ అధికారుల క్యాబిన్లతో పాటు ఫిర్యాదుదారులకు కల్పించాల్సిన వసతులపై ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సమీక్షించారు. హైడ్రా పోలీసు స్టేషన్ సైన్ బోర్డులు ప్రముఖంగా కనిపించేలా చూడాలని ఆదేశించారు. పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్ సౌకర్యం వుండేలా చూడాలని సూచించారు.
సంబంధిత కథనం