Hydra Ranganath: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య జరిగిన సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్ నాలుగు రోజుల్లోనే నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు తీర్పుపై రంగనాథ్ స్పందించారు. ఎస్సీ-ఎస్టీ కేసు కావడంతో మిర్యాలగూడ డిఎస్సీ శ్రీనివాసరావు టీమ్ సమర్ధవంతంగా పనిచేశారని రంగనాథ్ చెప్పారు.
దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు కొనసాగిందని, పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా కేసును చేధించామని, కాల్ డేటా మొదలుకుని ప్రతి అంశంలో జాగ్రత్త వహించినట్టు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వాడుకున్నట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో ఎక్కడా వెనక్కి తగ్గలేదని, కోట్ల రుపాయల సుపారీతో ముడిపడి ఉన్న కేసు కావడంతో దర్యాప్తులో జాగ్రత్త వహించినట్టు చెప్పారు.
ప్రణయ్ హత్య కేసులో కనీసం కాల్ డేటా కూడా ఎక్కడా దొరకలేదని, దానిని టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడ్డామని చెప్పారు. కోట్ల రుపాయల కాంట్రాక్టు కుదిరిన హత్య కాబట్టి దర్యాప్తులో జాగ్రత్త వహించినట్టు చెప్పారు. చార్జ్‌షీట్‌కు ముందే మున్ముందు ఏమేమి జరుగుతుందనే దానిపై గంటల తరబడి చర్చలు జరిగాయన్నారు.
ఏ దశలో ఏ సమస్య వస్తుందనే దానిపై ముందే చర్చించి ముందుకు వెళ్లినట్టు చెప్పారు. అప్పటి డీజీ మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు బాగా సహకరించారని చెప్పారు. హత్య కేసులో సాక్ష్యులుగా ఉన్న అమృత, ప్రణయ్ తల్లి ప్రేమలత వారు చెప్పిన దానికి చివరి వరకు కట్టుబడి ఉన్నారన్నారు.
2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడ జ్యోతి హాస్పటల్ వద్ద హత్య జరిగిందని, పరువు హత్యగా ప్రచారం జరిగిందని దానిని తాము పోలీసులుగా అంగీకరించలేమన్నారు. దర్యాప్తులో ఒక కులానికి ఎక్కువ పరువు, మరో కులానికి తక్కువ పరువు అనే దానిని పోలీసులుగా తాము ఒప్పుకోమని, అది కాంట్రాక్టు మర్డర్ అన్నారు. హత్యకు కోట్ల రుపాయల లావాదేవీలు జరిగాయని, హత్య కేసులో ప్రమేయం ఉన్న వారంతా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారని రంగనాథ్ చెప్పారు.
గుజరాత్‌లో మోదీ మంత్రి వర్గంలో ఉన్న హరీన్ పాండ్యా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారితో అమృతరావుతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారని చెప్పాడు. హరీన్ పాండ్యా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిలో ముగ్గురు ప్రణయ్ హత్య కేసులో ఉన్నారని, సిస్టమ్ నుంచి తప్పించుకోవడం ఎలాగో వారికి పూర్తి అవగాహన ఉందన్నారు.
హత్యకు పాల్పడిన శర్మకు మారుతీరావుకు సంబంధమే లేదని, అంత పకడ్బందీగా ప్రణాళిక రచించారన్నారు. సెప్టెంబర్ 14న హత్య జరిగితే సెప్టెంబర్ 18 నాటికి నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. దర్యాప్తులో ప్రతి కేసులో విమర్శలు ఉంటాయని వాటిని తాము పట్టించుకోలేదన్నారు. అన్ని ఆధారాలతో 1600 పేజీల చార్జిషీట్ వేశామని చెప్పారు.
సంబంధిత కథనం