చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలుంటాయని.. హైడ్రా హెచ్చరించింది. చెరువలపై నిరంతరం నిఘా ఉంటుందని.. మట్టిపోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హైడ్రా పలు సూచనలు చేసింది.
ప్రకృతి సమతుల్యతకు చెరువుల పరిరక్షణ ఎంతో అవసరమని.. ఆ దిశగా హైడ్రా పనిచేస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. బిల్డర్లు - ట్రాన్స్‌పోర్టర్లు కలసి.. మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని సూచించారు. అలా కాదు.. ఎవరికి వారుగా వ్యవహరించి.. మట్టిని తరలించే పని కాంట్రాక్టర్‌కు అప్పగించాం.. ఆయన ఎక్కడ పోస్తే మాకేంటి అనేట్టు బిల్డర్లు వ్యవహరిస్తే అందరిపైనా కేసులు పెడతామని హెచ్చరించారు.
ట్రాన్స్‌పోర్టు ఖర్చులు మిగులుతాయని దగ్గర్లోని చెరువుల ఒడ్డున పడేస్తామంటే.. వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా.. డ్రైవర్, వాహన యజమాని, మట్టిని ఎక్కడి నుంచి తెస్తున్నారో సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు రంగనాథ్. శిఖం భూములలో కూడా మట్టి నింపొద్దని సూచించారు. హైడ్రా పోలీసు స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇందులో కేసులు బుక్ అవుతాయని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువుల వద్ద కూడా 24 గంటలూ నిఘా ఉందని స్పష్టం చేశారు.
చెరువుల్లో మట్టిపోసి నింపుతున్న వారి సమాచారాన్ని ఇవ్వాలని నగర ప్రజలను హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబరు 9000113667 కేటాయించింది. హైడ్రా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని సూచించింది. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు.. కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ఈ క్రతువులో చేతులు కలపాలని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
సంబంధిత కథనం