HYDRA : అమీన్‌పూర్‌లో సమగ్ర సర్వే - లే ఔట్ల కబ్జాలపై 'హైడ్రా' కమిషనర్ కీలక ప్రకటన
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో లే ఔట్ల కబ్జాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. లే ఔట్ల సరిహద్దులను తేల్చేందుకు త్వరలోనే సమగ్ర సర్వే చేపడుతామని చెప్పారు. సర్వేతో అన్ని లెక్కలు తేల్చుతామని ప్రకటించారు.

అమీన్‌పూర్‌లో సమగ్ర సర్వే చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులపై అమీన్ పూర్ లో శుక్రవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. లే ఔట్ల కబ్జాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. లే ఔట్ల సరిహద్దులను తేల్చేందుకు త్వరలోనే హైడ్రా సమగ్ర సర్వే చేపడుతుందన్నారు.
సర్వేతో తేల్చుతాం - రంగనాథ్
సర్వే ఆఫ్ ఇండియా, ఏడీ సర్వే విభాగం, రెవెన్యూ, హైడ్రా సర్వే బృందాలతో అందరి సమక్షంలో పారదర్శకంగా సర్వే చేయించి లేఔట్ల సరిహద్దులను తేల్చుతామని రంగనాథ్ పేర్కొన్నారు. లే ఔట్లలోని పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా చూస్తామని వివరించారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి కూడా కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయని… అన్ని లెక్కలు తేల్చుతామన్నారు.
భారీగా తరలివచ్చిన బాధితులు….
క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా ఐలాపూర్, చక్రపురి కాలనీ, ఆర్టీసీ కాలనీ, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో రంగనాథ్ పర్యటించారు. స్థానికులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ వస్తున్నారనే సమాచారం తెలుసుకుని పెద్దయెత్తున తరలివచ్చి.. అక్కడ జరిగిన ఆక్రమణలపై బాధితులు ఫిర్యాదు చేశారు.
40 ఏళ్లుగా కబ్జాల చెరలో తమ ప్లాట్లు ఉన్నాయని కమిషనర్ తో బాధితులు మొరపెట్టుకున్నారు. కనీసం వాటిని చూడడానికి కూడా వీలు లేకుండా.. పోయిందని ఐలాపూర్ రాజగోపాల నగర్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. 1980లలో ప్లాట్లు దాదాపు 5 వేల మంది ప్లాట్లు కొన్నామని.. తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని అప్పటి అధికారులు పేర్కొనగా.. తాము కోర్టును ఆశ్రయించామని గుర్తు చేశారు. కోర్టులో తుది తీర్పు త్వరలోనే వెలువడనుందని.. ఈ లోగా ఇక్కడి ప్లాట్లను కబ్జా చేసిన వ్యక్తులు వేరేవాళ్లకు అమ్మేస్తున్నారని ఐలాపూర్ రాజగోపాల నగర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఇక్కడ ప్లాట్లు గతంలో కొన్న వారంతా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మధ్యతరగతి వారేనని బాధితులు చెప్పారు. తాము కన్నీటి పర్యంతమైనా స్థానిక అధికారులు స్పందించడంలేదని పలువురు వాపోయారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ చక్రపురి కాలనీ, ఆర్టీసీ కాలనీ, వెంకటరమణ కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని కమిషనర్ కు వివరించారు. తమ లే ఔట్లలోకి చొరబడి.. తమ ప్లాట్లను, కాలనీలోని పార్కులు, రహదారులను గోల్డెన్ కీ వెంచర్స్ వారు కబ్జాచేశారంటూ ఫిర్యాదులు చేశారు.
ఆందోళన చెందొద్దు…
ఐలాపురం గ్రామంలోని లేఔట్ పై కోర్టులో కేసులు వున్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అసలయిన లబ్ధిదారులు ఎవరన్నది తేల్చుతామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసానిచ్చారు.
త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ కూడా ఏర్పడుతోందని… కబ్జాదారుల పై చర్యలుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రజావసరాలకోసం ఉద్దేశించిన భూములను కాపాడాలనే సదుద్దేశంతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. కబ్జాదారులపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
సంబంధిత కథనం