AV Ranganath : విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం- ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
AV Ranganath On Owaisi College : ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. చెరువులను ఆక్రమించి కాలేజీ నిర్మించడం వాళ్ల పొరపాటిని, దానికి విద్యార్థుల భవిష్యత్ ను బలిపెట్టకూడదన్నారు. ఒవైసీ, మల్లారెడ్డికి తగిన సమయం ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా చర్యలు ఉంటాయన్నారు.
AV Ranganath On Owaisi College : హైడ్రా...అక్రమ నిర్మాణదారులను పరుగులుపెట్టిస్తోంది. హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో చెరువుల పరిరక్షణలో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది హైడ్రా. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా... అక్రమ నిర్మాణాలు తొలగిస్తుంది. ఇప్పటి వరకూ 18 చోట్ల ఆక్రమణలను తొలగించి 43 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.
ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలపై
హైడ్రా రాజకీయాలకు పావుగా మారదలుచుకోలేదని ఏవీ రంగనాథ్ తెలిపారు. ఒవైసీ, మల్లారెడ్డి అని వ్యక్తులను చూడమని, కాలేజీ కాబట్టి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచిస్తామన్నారు. చెరువులను ఆక్రమించి కాలేజీలు వాళ్ల పొరపాటన్నారు. చెరువుల పరిరక్షణ ముఖ్యమైన అంశమే, కానీ దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ఇంకా ముఖ్యమన్నారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వారికి తగిన సమయం ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉంటే ధర్మసత్రాలైనా కూల్చివేస్తామన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని, డైరెక్ట్ గా కూల్చివేయడమేనని స్పష్టం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు, నేతలు మంగళవారం హైడ్రా కమిషనర్ ను కలిశారు. హైదరాబాద్ లోని పలు చెరువులు, పార్కుల ఆక్రమణలపై బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్‌ను ఫిర్యాదు చేశారు.
జన్వాడ ఫామ్ హౌస్
హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్ హౌస్ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఈ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల, బపర్ జోన్ లో నిర్మించారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్లో వద్ద కొలతలు వేస్తూ కనిపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. హైడ్రా నిబంధనలకు తగిన విధంగా పనిచేయాలని సూచించింది. ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై కేటీఆర్ క్లారిటీ ఇస్తూ... ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని, తాను లీజ్ కు తీసుకున్నట్లు తెలిపారు. ఈ భవనం అక్రమ నిర్మాణం అయితే తానే కూల్చివేతకు సహకరిస్తానన్నారు.
అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా స్పీడ్ పెంచింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాళాలపై నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేస్తున్నారు. ఇటీవలే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైడ్రా కూల్చివేసింది. తాజాగా ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్కు వద్ద కొలతలు వేయడంతో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్ అని తెలుస్తోంది.
ఏవీ రంగనాథ్ కు భద్రత పెంపు
హైప్రొఫైల్ వ్యక్తుల అక్రమ భవనాలను కూల్చివేస్తుండడంతో... హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ముప్పు ఉందని తెలంగాణ సర్కార్ ఆయన భద్రతను పెంచింది. రంగానాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో ఏవీ రంగనాథ్‌కు ఏమైనా ముప్పు వాటిళ్లవచ్చన్న అనుమానంతో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.
సంబంధిత కథనం