Young Couple Died: గుండె పోటుతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Young Couple Died: అమెరికాలో గుండె పోటుతో భర్త మరణించడాన్ని తట్టుకోలేని హైదరాబాద్ యువతి, అంత్యక్రియలు జరిగిన మర్నాడే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
Young Couple Died: హైదరాబాద్‌లో యువజంట జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. కట్టుకున్న భర్త అకాల మరణంతో తీవ్ర మనోవేదన కు గురైన యువతి భర్తలేని ఈ లోకంలో తాను ఎందుకని తనువు చాలించింది. భర్త అమెరికాలో గుండెపోటుతో చనిపోగా, భార్య హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.
హృదయ విదారకఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు చూసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
హైదరాబాద్ అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మనోజ్‌తో ఏడాది కిందట వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు.
ఇద్దరూ డల్లాస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు ఈ నెల 2వ తేదీన సాహితి హైదరాబాద్ వచ్చింది. ఆమె హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అమెరికాలో ఉన్న ఆమె భర్త మనోజ్‌కు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.
భర్త మరణవార్త తెలిసినప్పటి నుంచి సాహితి తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ నెల 23న మనోజ్ భౌతికకాయాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన సాహితి తీవ్ర విచారంలో మునిగిపోయింది. బుధవారం మనోజ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత సాహితి అంబర్‌పేటలోని పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇంటికి వెళ్లినప్పటి నుంచి ముభావంగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడలేదు. తోడుగా ఉన్న చెల్లెలు గురువారం ఉదయం బయటకు వెళ్లడంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేవలం పది నిమిషాలు బయటకు వెళ్లి వచ్చే సరికి సాహితి దారుణానికి ఒడిగట్టిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.