KTR Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు-hyderabad women commission member tied rakhis to ktr chairperson gives notices ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు

KTR Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 24, 2024 10:48 PM IST

KTR Rakhi : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాఖీలు కట్టడంపై సభ్యులపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాఖీకట్టిన ఆరుగురు సభ్యులకు నోటీసులు జారీచేయాలని కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ సభ్యులు రాఖీలు కట్టడం సరికాదన్నారు.

కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు
కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు

KTR Rakhi : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. శనివారం ఆయన మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీసుకు వచ్చినప్పుడు హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీసుకు రాగా... బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకున్నారు. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ మహిళా నేతలు తమపై రాళ్ల దాడి చేశారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు. నోటీసులు ఇచ్చి మహిళా కమిషన్ ముందు హాజరవ్వమని దాడి చేస్తారా అని ప్రశ్నించారు.

కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీసుకు వచ్చినప్పుడు ఆరుగురు సభ్యులు... ఆయనకు రాఖీ కట్టారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సీరియస్ అయ్యారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ సభ్యులు రాఖీ కట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆరుగురు మహిళా సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మహిళా కమిషన్‌లోని ఆరుగురు సభ్యులు కేటీఆర్ కు రాఖీ కట్టి అనుచిత చర్యకు పాల్పడ్డారని తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. మహిళా కమిషన్ సభ్యులుగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, సంస్థ సమగ్రతను నిలబెట్టడం తప్పనిసరి అని మహిళా కమిషన్ అభిప్రాయపడింది. కమిషన్ తటస్థతపై ప్రశ్నలు లేవనెత్తే విధంగా వ్యవహరించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని నేరెళ్ల శారదా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రవర్తన కమిషన్ సభ్యులకు తగనిదన్నారు. ఈ చర్యలు మహిళా కమిషన్ గౌరవం, నిష్పాక్షికతను దెబ్బతీస్తుందన్నారు.

మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు

కేటీఆర్ కు రాఖీకట్టిన సభ్యులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కమిషన్ కార్యదర్శిని నేరెళ్ల శారదా ఆదేశించారు. మహిళా కమిషన్ తన నిష్పాక్షికతను లేదా న్యాయం పట్ల రాజీపడే ప్రవర్తనను సహించదన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ న్యాయాన్ని నిలబెట్టడానికి కట్టుబడి ఉందన్నారు. మహిళా కమిషన్ చర్యలు మహిళల సమస్యలకు సంబంధించిన విషయాలలో అవసరమైన గంభీరత, సున్నితత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయన్నారు. కమిషన్‌ కార్యాలయంలోకి మొబైల్‌ ఫోన్లు అనుమతించకపోయినా.. కొందరు రహస్యంగా ఫోన్లు తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై నేరెళ్ల శారద అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాఖీకి కూడా భయపడితే ఎలా? -కేటీఆర్

మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందిస్తూ...రాఖీకి కూడా భయపడితే ఎలా? అంటూ ట్వీట్ చేశారు. మహిళా కమిషన్ సభ్యులు కట్టిన రాఖీలను చూపిస్తూ ఎక్స్ లో ఫొటో పెట్టారు. అయితే రాఖీ పూర్ణిమ నాడు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శారద సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ ఫొటోలను బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత కథనం