Hyderabad Water Connections : వేసవి దృష్ట్యా హైదరాబాద్ జలమండలి అధికారులు తగిన చర్యలు చేపట్టారు. తాగునీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు మోటార్‌ను సీజ్ చేస్తామని, నీటి కనెక్షన్ కట్ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై బుధవారం అధికారులతో అశోక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జలమండలి అధికారులకు సూచించారు. 'మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్' పేరుతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
హైదరాబాద్‌లో నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. శుద్ధి చేసిన నీటిని వృథా చేస్తూ.. ఇతర అవసరాలకు ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. జలమండలి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి అందుబాటులో ఉండేందుకు ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా నీటిని వృథా చేస్తుంటే వారి ఫొటో, వినియోగదారు సమాచారం, నీటి క్యాన్ నంబర్ అంశాలను నమోదు చేస్తే యాప్‌లోనే జరిమానా నోటీసు సిద్ధమవుతుందని జలమండలి తెలిపింది.. వినియోగదారుడు నమోదు చేసుకున్న ఫోన్ నంబర్, మెయిల్‌కు నోటీసులు వెళ్లేలా యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు.
హైదరాబాద్ జలమండలి పరిధిలో 13.5 లక్షల వాటర్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 8.5 లక్షల కనెక్షన్లకు ప్రభుత్వం ఉచితంగా తాగునీరు అందిస్తుంది. ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు నీటిరి సరఫరా చేస్తున్నారు. శుద్ధి చేసి, నాణ్యతతో అందించేందుకు సగటున ప్రతి 1000 లీటర్లకు రూ.48 ఖర్చు చేస్తు్న్నారు.
ఇంత వ్యయంతో ఇస్తున్న తాగునీటిని కొంతమంది వాహనాలు, ఇంటి పరిసరాల క్లీనింగ్, గార్డెనింగ్‌లకు వృథాగా వాడుతున్నారని జలమండలి గుర్తించింది. ఇలా చేస్తే విరుద్ధమని పేర్కొంది. నగరంలో మరో రెండేళ్ల పాటు అదనపు నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటినే గోదావరి 2,3 దశలు పూర్తయ్యే వరకు వినియోగించుకోవాలని సూచించిందింది. నీటిని పొదుపుగా వాడుకోవడం, వృథా చేయకుండా అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
నగరంలో జలమండలి నీటి వృథాతో పాటు పలు అంశాలకు జరిమానాలు 35 ఏళ్ల క్రితం నాటివి అని, అవి నామమాత్రంగా అమల్లో ఉన్నాయని అశోక్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో జరిమానాలు పెంచుతూ జలమండలి ప్రభుత్వానికి తాజాగా ఓ ప్రతిపాదనలు పంపింది. నీటి వృథాకు ప్రస్తుతం విధిస్తున్న రూ.1000 జరిమానా పెచనున్నారు. ఈ మొత్తాన్ని రూ.5000కు పెంచేలా ప్రతిపాదించారు. రిజర్వాయర్ల వద్ద ఫ్లో మీటర్లను ఏర్పాటుచేయనున్నారు. నీటి లెక్కలు తేలితేనే వృథాకు అడ్డుకట్ట పడుతుందని జలమండలి భావిస్తుంది.
సంబంధిత కథనం