Hyderabad Crime : వనస్థలిపురంలో దారుణం, భార్యపై బండరాయితో దాడి చేసి హత్య!
Hyderabad Crime : హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో నడిరోడ్డుపై భార్యపై బండరాయితో దాడి చేసి హత్య చేశాడో వ్యక్తి.
Hyderabad Crime : హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని విజయపురి కాలనీ ఫేజ్-1 లో శుక్రవారం రాత్రి ఓ మహిళను ఆమె భర్త అందరూ చూస్తుండగానే బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు.
అసలేం జరిగిందంటే?
భదాద్రి కొత్తగూడెం జిల్లా మునుగురుకు చెందిన బాలకోటయ్య (40) కు శాతవాహనగర్‌కు చెందిన శాలిని(30)కి 15 ఏండ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వీరు విజయపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలకోటయ్య కార్మికుడిగా పనిచేస్తుంటాడు. గత కొన్ని రోజులుగా బాల కోటయ్య, శాలిని మధ్య చిన్న విషయాలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నెల రోజులుగా భార్య శాలిని ఇద్దరి కుమారులతో కలిసి తన పుట్టింట్లో ఉంటుండగా భర్త కోటయ్య హయాత్ నగర్ లో ఉంటున్నాడు.
అందరూ చూస్తుండగానే
భార్య కదలికలను సీక్రెట్ గా గమనిస్తూ వచ్చిన కోటయ్య శుక్రవారం రాత్రి 9:30 గంటలకు విజయపురి కాలనీలో నివాసం ఉంటున్న తన చెల్లెలు ఇంటికి స్కూటర్ మీద వెళ్తున్న భార్య శాలినిని అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆమెను బండి పై నుంచి కిందికి తోసి అందరూ చూస్తుండగా బండరాయితో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కోటయ్యను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లతో హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం హత్య జరిగిన ప్రదేశంలోని రహదారులు, షాపుల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. షాలిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. జగద్గిరిగుట్టలోని శ్రీరాం నగర్ లో గత కొంత కాలంగా సునగిరి అనిత (23) , మల్లేష్ యధవ్ నివాసం ఉంటున్నారు. వీరు మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకోగా వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం సునగిరి అనిత (23) ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త మల్లేష్ లేసే సరికి అనిత విగత జీవిగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అనిత అత్తామామలు వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అనిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పదో అంతస్తుపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం
నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ పదో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తూ పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చందిన ఉత్తం ఉద్వేష్ ( 35) కొంత కాలంగా ఎల్లమ్మ బండ అపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు. కాగా శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పదో అంతస్తులో పని చేస్తున్న ఉద్వేష్ ప్రమాదవశాత్తూ కింద పడి మరణించాడు. అదే అపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తోటి కార్మికులు జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.