TSRTC Special Buses : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్-విశాఖ, చెన్నై సహా దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు
TSRTC Special Buses : వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు ప్రయాణాలు పెరిగాయి. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.-
TSRTC Special Buses : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా సెలవుల రావడంతో ఈరోజు, రేపు దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటుచేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై, శిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, ఇతర ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. బస్సుల వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని సూచించారు.
హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో ఇటీవల కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతుంది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ రూట్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయి. మరో 30 ఐటీ కారిడార్ లో నడుస్తాయి. వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
800 ఎలక్ట్రిక్ బస్సులు
"ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తున్నాయి. అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రా అందజేయనుంది. వీటికి తోడు సిటీలో మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది" అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది.