TSRTC To TGSRTC : టీఎస్ఆర్టీసీ పేరు మార్పు, ఇకపై టీజీఎస్ఆర్టీసీ-hyderabad tsrtc name change into tgsrtc md sajjanar announced ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc To Tgsrtc : టీఎస్ఆర్టీసీ పేరు మార్పు, ఇకపై టీజీఎస్ఆర్టీసీ

TSRTC To TGSRTC : టీఎస్ఆర్టీసీ పేరు మార్పు, ఇకపై టీజీఎస్ఆర్టీసీ

TSRTC To TGSRTC : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మారుస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాల్లో సైతం మార్పులు చేసినట్లు ప్రకటించారు.

టీఎస్ఆర్టీసీ పేరు మార్పు, ఇకపై టీజీఎస్ఆర్టీసీ

TSRTC To TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) పేరు మారింది. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చినట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చామన్నారు. ఆ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలను సైతం టీజీఎస్ఆర్టీసీగా మార్చామన్నారు. ప్రయాణికులు విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సజ్జనార్ కోరారు. అలాగే టీజీఎస్ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు.

టీఎస్ టు టీజీ

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్... టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు.

సీఎస్ ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించారు. జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్‌ హెడ్స్‌, అధికారిక పత్రాల్లో సైతం టీజీ అని వచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికే టీఎస్‌ పేరుతో ముద్రించిన పత్రాలపై ఈ నెలాఖరుకు నివేదిక అందజేయాలని సీఎస్ ఆదేశించారు.

వాహనాల ప్లేట్లపై టీజీ

తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ కు బదులు టీజీ అని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ జారీ చేసింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లకు టీజీ అనే చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి తెలిపింది. దీంతో ఇకపై వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్‌ను బదులుగా టీజీగా ముద్రించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర కోడ్ ను టీజీగా ముద్రించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వాహనాల నంబర్ ప్లేట్లపై టీజీ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. సీరియల్ నంబర్ 29ఏ ప్రకారం టీఎస్ బదులుగా టీజీ అని మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కేంద్రానికి పంపిన తీర్మానంపై మార్చి 12న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఈ మార్పు చేసినట్లు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి టీఎస్‌ స్థానంలో టీజీ కేటాయించాలని స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం కోడ్ ను టీజీగా నిర్ణయిస్తారని అందరూ భావించారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ కోడ్ ను సూచించింది. దీంతో గత పదేళ్లు టీఎస్ కోడ్ ను అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్ ను టీజీగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.