Sajjanar On Gaddar : గద్దర్ విప్లవ ప్రయాణానికి రథసారిధి, ఆసక్తిరేపుతోన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ట్వీట్-hyderabad tsrtc md ips officer sajjanar pays tributes to folk singer gaddar ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Hyderabad Tsrtc Md Ips Officer Sajjanar Pays Tributes To Folk Singer Gaddar

Sajjanar On Gaddar : గద్దర్ విప్లవ ప్రయాణానికి రథసారిధి, ఆసక్తిరేపుతోన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ట్వీట్

Bandaru Satyaprasad HT Telugu
Aug 07, 2023 02:37 PM IST

Sajjanar On Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి టీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ నివాళులర్పించారు. గద్దర్ తో తనకున్న అనుబంధంపై సజ్జనార్ ట్వీట్ చేశారు.

గద్దర్ కు సజ్జనార్ నివాళి
గద్దర్ కు సజ్జనార్ నివాళి

Sajjanar On Gaddar : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్‌ తో తనకున్న అనుబంధాన్ని సజ్జనార్‌ గుర్తుచేసుకున్నారు. నెల రోజుల క్రితం ఆయన తనను కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని గద్దర్ అన్నారని చెప్పారు. అంతలోనే గద్దర్‌ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ధ నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్‌ నిలిచిపోయారని కొనియాడారు.

ట్రెండింగ్ వార్తలు

''గద్దర్ తో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్‌ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారు" అని సజ్జనార్‌ అన్నారు.

గద్దర్ పాటలు చరిత్రలో నిలిచిపోతాయి

ప్రజాస్వామ్యం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యమని గద్దర్‌ భావించారని సజ్జనార్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తను మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారని అన్నారు. గద్దర్ పార్థివ దేహానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున నివాళులు అర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సజ్జనార్‌ అన్నారు. ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఏర్పడ్డ స్పెషల్ ఇంటెలిజెంట్ బ్యూరో ఎస్ఐబీకి సజ్జనార్ గతంలో ఐజీగా పనిచేశారు. అనేక ఎన్‌కౌంటర్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి మావోయిస్టు సానుభూతిపరుడు, విప్లవ వాది అయిన గద్దర్‌కి చాలా దగ్గర వ్యక్తి కావటం ఆసక్తిరేపుతోంది. గద్దర్ అంటే తనకు అభిమానమని గద్దర్ పాటలు చరిత్రలో నిలిచిపోతాయని సజ్జనార్ ట్వీట్ ద్వారా తెలిపారు.

గద్దర్ పేరు కాదు ఒక బ్రాండ్

"గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న. గద్దర్ తో నాకు సుమారు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాల్లో నాతో పాలు పంచుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు. గద్దర్ ఎన్నో సందర్భాలలో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరార "అన్నా" అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ ను మించిన కవి, గాయకుడు లేరని చెప్పవచ్చు."-సజ్జనార్

పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటారు

తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు గద్దర్ అని సజ్జనార్ గుర్తుచేసుకున్నారు. ఈ మధ్య కాలంలో గద్దర్ ఆరోగ్యం క్షీణించిందని తెలిసిందని, కానీ సమయాభావం వల్ల కలువలేకపోయానన్నారు. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటారని సజ్జనార్ అన్నారు. ఉద్యమ కారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారన్నారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం అన్నారు.

WhatsApp channel