TSPSC Paper Leak ED Case : పేపర్ లీకేజీపై రంగంలోకి దిగిన ఈడీ
TSPSC Paper Leak ED Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఈడీ కేసు నమోదు చేసింది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో కేసు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు జరగడంతో వాటిని నిగ్గు తేల్చేందుకు ఈడీ కేసులు నమోదు చేసింది.
TSPSC Paper Leak ED Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసినట్లు సమాచారం. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ పై సిట్ తో పాటుగా ఈడీ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. పేపర్ లీక్ లో హవాలా ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ భావిస్తుంది.
పేపర్ లీక్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 15 మందిని ఈడీ తిరిగి విచారించనుంది. అవసరమైన పక్షంలో టీఎస్పీఎస్సీ సభ్యులు, సెక్రెటరీని విచారించే అవకాశం ఉంది. తెలంగాణలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా రెండు ముఖ్యమైన వ్యవహారాలపై కేసులు నమోదు చేసింది. మరోవైపు వ్యక్తిగత డేటా చోరీ పైనా ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ.. బ్యాంకులతోపాటు పలు సంస్థలకు నోటీసులు ఇవ్వనుంది.
సెక్రటరీ అనితా రామచంద్రన్ విచారణ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ పెంచింది. ఇప్పటికే బోర్డు ఛైర్మన్, సెక్రటరీ సహా ఇతర సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ కు సిట్ బృందం విచారించింది. ఈ లీకేజీ వ్యవహారం మొత్తం టీఎస్పీఎస్పీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చుట్టూనే తిరుగుతోంది. అత్యంత విశ్వసనీయంగా ఉండాల్సిన ఆ కాన్ఫిడెన్షియల్ విభాగంలో నిఘా వైఫల్యం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని విచారించింది సిట్.
ప్రశ్నపత్రాల భద్రత, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నిందితుడు ప్రవీణ్ ఎలా సంపాదించాడు.. అనే విషయాలపై సుదీర్ఘంగా విచారించింది. నిన్న టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను కూడా సిట్ బృందం విచారించింది. ఈ సమాచారంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రత, పర్యవేక్షణలో ఛైర్మన్, సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ లోపాలను అవకాశంగా మార్చుకున్న సెక్రటరీ పీఏ ప్రవీణ్, నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి పేపర్లను చోరీ చేశారు. ఈ మొత్తం విచారణను పూర్తి చేసి రిపోర్టును సీల్డ్ కవర్‌లో ఈ నెల 11 వరకు కోర్టుకు సిట్ అధికారులు అందజేయనున్నారు.
100కి పైగా మార్కుల వచ్చిన అభ్యర్థుల విచారణ
గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్తులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. వారి వివరాలను, బ్యాక్‌గ్రౌండ్‌ను విచారిస్తున్నారు. దీంతో అభ్యర్థులకు వాస్తవంగా ఆ మార్కులు వచ్చాయా అని తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది.
121 మందిలో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేశ్, మాజీ ఉద్యోగి సురేశ్‌తోపాటు న్యూజిలాండ్ నుంచి వచ్చి గ్రూప్-1 పరీక్ష రాసి 103 మార్కులు సాధించిన రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డి నిందితులుగా తేలినట్లు సిట్ పేర్కొంది. లీకైన గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్ పలువురికి అందించగా అందులో 15 మందిని ఇప్పటికే సిట్ అరెస్టు చేసింది. ఇంకెంత మందికి ఆ లీకైన ప్రశ్నాపత్రాలు చేరాయో తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. వారి ద్వారా ఎవరెవరికి నగదు అందింది అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తుంది.