Hyderabad Traffic Diversions : వాహనదారులకు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు-hyderabad traffic diversions in city bakrid prayers heavy police deployed for security ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic Diversions : వాహనదారులకు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Diversions : వాహనదారులకు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu
Jun 16, 2024 03:53 PM IST

Hyderabad Traffic Diversions : సోమవారం బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో వాహనాలు మళ్లించారు. ఓల్డ్ సిటీలో 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తు్న్నారు.

వాహనదారులకు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
వాహనదారులకు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Diversions : రేపు(సోమవారం) బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దాదాపు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు ఉండనున్నారు. ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రార్థనలకు సుమారు 30 వేల మందికి పైగా హాజరు అవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా అన్ని శాఖల అధికారులు, మత పెద్దలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు.

ప్రార్థన ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి

మరోవైపు పశువధపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పశువులను తరలించే వాహనాలను తనిఖీ చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల 23 చెక్ పోస్టులు అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60కి పైగా చెక్ పోస్టులు పెట్టి ముమ్మరంగా వాహనల తనిఖీలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఓల్డ్ సిటీ లోని ప్రార్థనలు చేసే ఏరియాల్లో ఏర్పాటుపై జీహెచ్ఎంసీ, వక్ఫ్ బోర్డు సహకారంతో ముందుకు వెళుతున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

బక్రీద్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. పాతబస్తీ లోని పలు రోడ్లపై వాహనాలు రాకపోకలను నిలిపి వేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. బహదూర్ పురా క్రాస్ రోడ్స్ మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల మధ్య పురానా పూల్, కామతి పూరా, కిషన్ బాగ్ వైపు నుంచి ప్రార్థనకి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం జూపార్క్, మసీదు అల్లా హు అక్బర్ ఎదురుగా వాహనాలు పార్కింగ్ కు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎవరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా గ్రేటర్ పరిధిలో రిటైల్ బీఫ్ దుకాణాలు, 17,18 తేదీల్లో మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్,హైదరాబాద్ జిల్లా

WhatsApp channel