Revanth Reddy : జీవో 111 రద్దు వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్, ముందు భూములు కొనుగోలు చేసి జీవో ఎత్తివేత - రేవంత్ రెడ్డి
Revanth Reddy : జీవో 111 రద్దు వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నారు.

Revanth Reddy : ఓఆర్ఆర్ ను ముంబయి కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్ టోల్ గేట్స్ లీజ్ విషయంలో మరో భారీ దోపిడీకి కేసీఆర్ తెరలేపారని మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో 10 శాతం చెల్లించాలని, అంటే రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటే, ఇంకా సమయం అడుగుతున్నారన్నారు. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా వ్యవహరించేలా మంత్రి కేటీఆర్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ నెల 26 లోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10 శాతం నిధులు చెల్లించాలన్నారు. లేకపోతే ఈ సంస్థకు కేటాయించిన టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్ట్ సంస్థ ఆర్థికంగా బాగా ఉందని ఇప్పటి దాకా ప్రచారం చేశారని, ఇప్పుడా సంస్థ నిధులు లేవు, 120 రోజుల సమయం కోరిందన్నారు. ఈ అవినీతిపై కాగ్, సెంట్రల్ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
నా టికెట్ కూడా సర్వే బట్టే
పార్టీలో చేరికలపై స్పందించిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. చివరికి తన టికెట్ కూడా సర్వే ఆధారంగా కేటాయిస్తారన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్యకు కూడా సర్వే ప్రకారమే టికెట్ ఇచ్చారన్నారు. పార్టీలో చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుందన్న ఆయన... ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఈ విషయాన్ని స్పష్టంచేశారన్నారు. పొంగులేటి పార్టీలో చేరిక ప్రతిపాదన వస్తే తప్పకుండా చర్చిస్తామన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తనని ఎలా వాడుకోవాలో అని అధిష్టానం ఆలోచిస్తుందన్నారు. పార్టీలో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజమే అన్నారు. పాత కొత్త అని బేదం ఉండకూడదని అధిష్టానమే చెబుతోందన్నారు.
జీవో 111 రద్దుపై
జీవో 111 రద్దు వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నారు. ముందు భూములు కొనుగోలు చేశాక జీవో 111 ఎత్తివేశారన్నారు. 111 జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా ఎన్జీటీ వెళ్తామన్నారు. 2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో భూముల క్రయ విక్రయాల వివరాలు బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.