Revanth Reddy On G.O 111 : లేక్ సిటీ హైదరాబాద్ లో చెరువులు మాయం, జీవో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం- రేవంత్ రెడ్డి-hyderabad tpcc president revanth reddy sensational comments on g o 111 cancellation cm kcr ktr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Tpcc President Revanth Reddy Sensational Comments On G.o 111 Cancellation Cm Kcr Ktr

Revanth Reddy On G.O 111 : లేక్ సిటీ హైదరాబాద్ లో చెరువులు మాయం, జీవో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం- రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
May 22, 2023 04:39 PM IST

Revanth Reddy On G.O 111 : జీవో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం దాగుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కన్నా ప్రమాదమన్నారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy On G.O 111 : సీఎం కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 రద్దుతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. 111 జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ప్రమాదమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 111 జీవో ఆదేశాల వెనక నేపథ్యం గమనించాలన్నారు. 1908లో హైదరాబాద్ కు వరదలు వచ్చి 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందన్నారు. దీంతో వరద నివారణకు ఆనాటి నిజాం గ్లోబల్ టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో మూసీ, ఈసా నదులపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించారన్నారు. జంట జలాశయాలను రక్షించేందుకు 1996లో 111 జీవోను ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. 84 గ్రామాలను బయో కన్సర్వేషన్ జోన్ లో పెట్టారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

జీవో 111 రద్దు దుర్మార్గపు నిర్ణయం

నిజాం, సమైక్య పాలకులు కూడా నగరాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 111 జీవోను అమలు చేశారన్నారు. కానీ కేసీఆర్ ధన దాహంతో జీవో 111ను రద్దు చేశారన్నారు. ఈ జీవో రద్దు వెనక కుట్ర ఉందన్నారు. 80 శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. 111 జీవో రద్దు దుర్మార్గపు నిర్ణయమన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పోరాటం ఫలితంగానే కృష్ణా, గోదావరి జలాలు తరలింపు జరిగిందన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను విధ్వంసం చేసే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు పైప్ లైన్ ఇస్తాననడం వెనక కుట్ర దాగుందన్నారు. ఈ విషయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీని వెనక లక్షల కోట్ల కుంభకోణం దాగుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ విధ్వంసం వెనుక భారీ కుంభకోణం

బందిపోట్లను, దావూద్ నైనా క్షమించవచ్చు.... కానీ కేసీఆర్, కేటీఆర్ ను క్షమించకూడదని రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం భూములు పేదల నుంచి కొనుగోలు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారని ఆరోపించారు. పర్యావరణ విధ్వంసానికి కేసీఆర్ పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధ్వంసం వెనుక భారీ భూ కుంభకోణం ఉందన్నారు. 111 జీవో రద్దుపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నామన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు బీఆరెస్ నేతలు కొన్న భూముల వివరాలు కమిటీ సేకరిస్తుంది. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ లావాదేవీలు బయటపెట్టాలన్నారు. బినామీ యాక్టును కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆరెస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తోందని ఆరోపించారు. ఇది బీజేపీ, బీఆరెస్ మధ్య కుదిరిన ఒప్పందమన్నారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణం అన్నారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ ను అమరవీరుల స్థూపం వద్ద కట్టేసి కొట్టినా తప్పు లేదని తీవ్రంగా విమర్శించారు.

లేక్ సిటీలో చెరువులు మాయం

"లేక్ సిటీ హైదరాబాద్ లో చెరువులే లేకుండా పోయాయి. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ నగరానికి విధ్వంసం పొంచి ఉంది. మాస్టర్ ప్లాన్ లేకుండా లక్షా 30వేల ఎకరాలకు అనుమతులు ఎలా ఇస్తారు?. 111 జీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఎందుకు చేయలేదు.

ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు? అరవింద్ కుమార్, సోమేశ్, కేసీఆర్, కేటీఆర్ దుష్టచతుష్టయం. ఈ దుష్టచతుష్టయమే విధ్వంసానికి కారణం. జంట నగరాలను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి ఏజెన్సీలకు పిర్యాదు చేయాలి. బండి సంజయ్ రంకెలేయడం కాదు... మోకాలుకు బోడి గుండుకు ముడి పెట్టడం కాదు. చిత్తశుద్ధి ఉంటే ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి. దుష్టచతుష్టయంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలి. మా పార్టీ కార్యాలయంకు రావాల్సిన భూమిపై 2016లో సుప్రీంకోర్టులో కేసీఆర్ కేసు ఉపసంహరించుకున్నారు. మా పార్టీకి కార్యాలయమే అక్కర్లేదని కేసీఆర్ ఈ కేసును ఉపసంహరించుకున్నారు. ప్రత్యామ్నాయంగా మా పార్టీకి భూమి ఇవ్వరా? కేసీఆర్ కు ఎకరంపైన బంజారాహిల్స్ లో బీఆరెస్ కు భూమి కేటాయించాం. 5100 గజాలు మా పార్టీకి కేటాయించాలి. మా పార్టీకి రావాల్సిన భూమి ఇవ్వకుండా బీఆర్ఎస్ కు 11 ఎకరాలు కేటాయించుకోవడం దుర్మార్గం. " -రేవంత్ రెడ్డి

WhatsApp channel