Hyderabad Traffic : హైదరాబాద్‌లో రెండు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!-hyderabad to see two months of traffic restrictions at gachibowli area ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic : హైదరాబాద్‌లో రెండు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!

Hyderabad Traffic : హైదరాబాద్‌లో రెండు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!

Hyderabad Traffic : రోడ్ల కనెక్టివిటీ, ఫ్లైఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. కీలక జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రత్యామ్నాయ మార్గలు ఇలా ఉన్నాయి.

గచ్చిబౌలి జంక్షన్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని శిల్ప లేఅవుట్ ఫేజ్-II ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కారణంగా గచ్చిబౌలి జంక్షన్ చుట్టూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడనుంది. ఈ పనులు రెండు నెలల పాటు కొనసాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 24 గంటలు పనులు చేయనున్నారు. దీంతో పిల్లర్ నంబర్ 24 వద్ద వాహనాల రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయ మార్గాలు..

వాహనాల రద్దీని తగ్గించడానికి అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. జట్పీహెచ్ఎస్ నుండి గచ్చిబౌలి వైపు ప్రయాణించే వాహనాలను.. రోలింగ్ హిల్స్ వద్ద శిల్పా ఫ్లైఓవర్ వైపు మళ్లించాలని అధికారులు నిర్ణయించారు. అటు కాకపోతే రాడిసన్ హోటల్ మీదుగా డీఎల్ఎఫ్, ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లాలని సూచించారు.

దారి మళ్లింపు..

గచ్చిబౌలి నుండి కొండాపూర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను.. గచ్చిబౌలి వద్ద డిఎల్‌ఎఫ్ రోడ్, రాడిసన్ హోటల్ ద్వారా మళ్లిస్తారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు ఆలస్యం కాకుండా అనుగుణంగా ఉన్న మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

చిక్కులు తప్పించేందుకు..

భాగ్యనగరంలో ట్రాఫిక్‌ చిక్కులు తప్పించేందుకు.. ప్రభుత్వం రూ.25వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. అసాధ్యమనుకున్న కేబుల్‌ స్టే బ్రిడ్జిని నిర్మించారు. ఇప్పటి వరకు లేని అధునాతన సాంకేతిక విధానాలు అందుబాటులోకి తెస్తున్నారు. మైండ్‌స్పేస్‌ దగ్గరి శిల్పా లే అవుట్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ పనుల్లో భాగంగా స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్స్‌‌ను వాడారు.

పోర్టల్‌ ఫ్రేమ్స్‌ వాడకం..

ఫ్లైఓవర్ల మార్గాల్లో మలుపులు, మూలలు వంటివి వచ్చే ప్రాంతాల్లో.. పోర్టల్‌ ఫ్రేమ్స్‌ను వాడుతున్నారు. మెట్రో రైలు మార్గాల్లోనూ పలు ప్రాంతాల్లో ఇలాంటి పోర్టల్‌ ఫ్రేమ్స్‌ వినియోగించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌కు పోర్టల్‌ ఫ్రేమ్స్‌ అవసరమైన మూడు చోట్ల.. కాంక్రీట్‌ పోర్టల్‌ ఫ్రేమ్స్‌‌కు బదులు స్టీల్‌ ఫ్రేమ్స్‌ను వాడుతున్నారు. కొండాపూర్‌ వైపు నుంచి ఓఆర్‌ఆర్‌ వైపు వెళ్లే ఫ్లైఓవర్‌ పనుల్లో భాగంగా.. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై రెండో వరసలో భూమి నుంచి 18 మీటర్ల ఎత్తులో.. 64 మీటర్ల పొడవైన 3 స్టీల్‌ గర్డర్లను ఏర్పాటు చేశారు.