Hyderabad To Ayodhya Flight Services : రామభక్తులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు
Hyderabad To Ayodhya Flight Services : హైదరాబాద్ నుంచి అయోధ్యకు పలు కమర్షియల్ ఎయిర్ లైన్స్ డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభాయి. ఏప్రిల్ 2 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Hyderabad To Ayodhya Flight Services : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు(Hyderabad to Ayodhya Flights) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడ్రోజులు(మంగళ, గురు, శనివారాలు) విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అయోధ్యలోని శ్రీరాముడి దర్శనానికి(Ayodhya Ram mandir) వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా... హైదరాబాద్, అయోధ్య మధ్య విమానాల రాకపోకల కోసం కమర్షియల్ ఎయిర్‌లైన్స్(Airlines) తో మాట్లాడారు. ఇకపై హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడ్రోజుల చొప్పున మంగళవారం, గురువారం, శనివారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.

ప్రత్యేక రైళ్లు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ నుంచి రామ భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను(Ayodhya Special Trains) ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లోని భక్తులకు రామమందిరం దర్శనానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి ప్రత్యేక సర్వీసులను సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు.
స్పైస్ జెట్ డైరెక్ట్ విమాన సేవలు
అయోధ్య (Ayodhya Ram Mandir)ను ఎనిమిది నగరాలతో కలిపే స్పైస్ జెట్ (Spice Jet)డైరెక్ట్ విమాన సర్వీసును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి వీకే సింగ్ ఇటీవ ప్రారంభించారు. ఈ విమానాల రాకపోకలతో భక్తులు, పర్యాటకులకు అయోధ్య శ్రీరామ లల్లా దర్శనం సులభమవుతుంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 30, 2023న ప్రధాని మోదీ ప్రారంభించారు. స్పైస్ జెట్ ఇప్పుడు దర్భాంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపూర్, పాట్నా, దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల నుంచి అయోధ్యకు నాన్ స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ లను నడుపుతోంది. అయోధ్యకు నాన్ స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం కావడం వల్ల అయోధ్య కనెక్టివిటీ పెరగడమే కాకుండా పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు.
సంబంధిత కథనం