Hyderabad Firing : గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాల్పులు, కానిస్టేబుల్ కు గాయాలు-పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ దొంగ
Hyderabad Firing : హైదరాబాద్ లో ఓ దొంగ పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్, బౌన్సర్ గాయపడ్డారు. కాల్పుల జరిపిన దొంగ మోస్ట్ వాంటెట్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గా పోలీసులు గుర్తించారు.
Hyderabad Firing : హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ కాల్పులు జరిపాడు. ప్రిజం పబ్ లో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై దొంగ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, ఓ బౌన్సర్‌కు గాయాలయ్యాయి. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసున్నారు. దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు.

గచ్చిబౌలి కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామంగా తెలుస్తోంది. బత్తుల ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రభాకర్ గచ్చిబౌలి ప్రిజం పబ్ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్ కు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. 2022లో విశాఖ పోలీసుల కస్టడీ నుంచి ప్రభాకర్ తప్పించుకున్నాడు.
అసలెవరీ ప్రభాకర్?
గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో శనివారం రాత్రి జరిగిన ఒక సంఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రిజం నైట్‌క్లబ్ లో తనిఖీలు చేపట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రభాకర్ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తొడలోకి దూసుకుపోయింది, ఎదురుకాల్పుల్లో ఒక బౌన్సర్ కూడా గాయపడ్డాడు. ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అనంతరం పోలీసులు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
2020లో బత్తుల ప్రభాకర్‌ను పోలీసులు వైజాగ్‌లో అరెస్టు చేశారు. 2022లో విశాఖ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న బత్తుల ప్రభాకర్... రెండేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు. 26 ఏళ్ల ప్రభాకర్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో 100కి పైగా దోపిడీ కేసులను ఉన్నాయి. అనకాపల్లి కోర్టు నుంచి వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా...ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా అతడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై అరిలోవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయినా తన నేర కార్యకలాపాలను కొనసాగిస్తూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నాడు.