TGSRTC Dasara Services : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్-hyderabad tgsrtc md sajjanar review on dasara bathukamma special services heavy rush ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Dasara Services : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్

TGSRTC Dasara Services : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్

Bandaru Satyaprasad HT Telugu
Oct 07, 2024 10:00 PM IST

TGSRTC Dasara Services : ద‌స‌రాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్యలపై పోలీస్, రవాణా శాఖలతో ఎండీ సజ్జనార్ సమీక్షించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు నేప‌థ్యంతో ర‌ద్దీ దృష్ట్యా గ‌త ఏడాదితో పోల్చితే అద‌నంగా 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను తిప్పాల‌ని నిర్ణయించామన్నారు.

ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్
ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్

స‌ద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి స‌హ‌క‌రించాల‌ని పోలీస్, ర‌వాణా శాఖ‌ల అధికారుల‌ను ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జనార్ కోరారు. గ‌త‌ ద‌స‌రాతో పోల్చితే ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంద‌ని, గతంలో మాదిరిగానే స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని ఆయన కోరారు. ద‌సరా ఆప‌రేష‌న్స్‌పై హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ద‌స‌రాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల గురించి వారికి ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా ఆర్టీసీ అధికారులు వివ‌రించారు.

yearly horoscope entry point

ఈ సంద‌ర్భంగా సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్ మాట్లాడుతూ.. పండుగ స‌మ‌యాల్లో ప్రయాణికుల‌ను సుర‌క్షితంగా గ‌మ్యస్థానాల‌కు చేర‌వేసేందుకు టీజీఎస్ఆర్టీసీకి పోలీస్, ర‌వాణా శాఖ‌లు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. సంస్థ వృద్ధిలో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉంద‌ని అన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని ప్రజ‌ల‌కు సూచించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణిస్తే తలెత్తే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

6304 ప్రత్యేక బస్సులు

"స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం చేసింది. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు నేప‌థ్యంతో ర‌ద్దీ దృష్ట్యా గ‌త ఏడాదితో పోల్చితే అద‌నంగా 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను తిప్పాల‌ని నిర్ణయించింది. ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతోంది.

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తున్నాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియ‌మించాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియ‌మించాం.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

తిరుగు ప్రయాణం రద్దీకి ప్రత్యేక బస్సులు

ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌక‌ర్యార్థం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, త‌దిత‌ర ప్రాంతాల‌కు బ‌స్సుల‌ను నడిపేలా ప్లాన్ చేసిన‌ట్లు తెలిపారు. ముఖ్యంగా జేబీఎస్ నుంచి 1602, ఎల్బీన‌గ‌ర్ నుంచి 1193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘ‌ర్ నుంచి 451 అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణం ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఈ నెల 13, 14 వ తేదిల్లోనూ ప్రత్యేక బ‌స్సులను ఏర్పాటు చేస్తున్నామ‌ని వివ‌రించారు.

బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా బ‌స్సుల క‌ద‌లిక‌ల‌ను గుర్తించేంద‌ుకు గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు.

హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పండుగ వేళ‌ల్లో టీజీఎస్ఆర్టీసీకి త‌మ స‌హ‌కారం ఎప్పటికీ ఉంటుంద‌ని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చడానికి టీజీఎస్ఆర్టీసీతో సమన్వయంగా పని చేస్తామని చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం