TGSRTC Ticket Charges : టీజీఎస్ఆర్టీసీ టికెట్ల ఛార్జీలు పెంపుపై ప్రచారం, సజ్జనార్ క్లారిటీ
TGSRTC Ticket Charges : టీజీఎస్ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచినట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇందులో వాస్తవం లేదని తెలిసింది. సాధారణ టికెట్ ఛార్జీలు పెంచలేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
TGSRTC Ticket Charges : టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయన్నారు. హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు. ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించినట్లు తెలిపారు. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందన్నారు. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించిందని చెప్పారు. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం టీజీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.

ప్రచారం ఇలా?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మరోసారి టికెట్ ఛార్జీలను పెంచిందని ప్రచారం జరిగింది. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెంచుతూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ టికెట్ ఛార్జీలను పెంచిందని వార్తలు వచ్చాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులో టికెట్ పై రూ.3 పెంచిందని ప్రచారం జరిగింది. టోల్ ఛార్జీలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ప్రయాణికులపై భారం పడుతుంది. సాధారణ బస్సులో అయితే రూ.3, ఎక్స్ ప్రెస్ బస్సులో అయితే రూ.10 నుంచి రూ.13, డీలక్స్,సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సులలో అయితే రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సులో రూ.14 నుంచి రూ.17, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులో రూ.15 నుంచి రూ.18, ఏసీ స్లీపర్ బస్సులో రూ.20 నుంచి రూ.23 వరకు ఛార్జీలు పెంచినట్టు ప్రచారం జరగగా... అది వాస్తవం కాదని తెలిసింది. నిత్యం 30 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని......అందులో నగరంలో దాదాపు 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సులో మరో 12 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు. ఛార్జీలు పెంచితే కేవలం పురుషుల పైనే అధికంగా భారం పడనుంది. ఛార్జీల పెంచితే ప్రయాణికులు, ముఖ్యంగా పురుష ప్రయాణికులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్న బస్సులో సీటు దొరకడం లేదని, సదూర ప్రాంతాలకు కూడా గంటల తరబడి నిలబడే వెళ్లవలసిన పరిస్థితి ఉందని పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం