Rajiv Gandhi Civils Abhayahastam : సివిల్స్ పాసైతే రూ. లక్ష ఆర్థిక సాయం, ఈ పథకం అర్హతలు ఇవే!-hyderabad tg govt started rajiv gandhi civils abhaya hastham scheme guidelines here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajiv Gandhi Civils Abhayahastam : సివిల్స్ పాసైతే రూ. లక్ష ఆర్థిక సాయం, ఈ పథకం అర్హతలు ఇవే!

Rajiv Gandhi Civils Abhayahastam : సివిల్స్ పాసైతే రూ. లక్ష ఆర్థిక సాయం, ఈ పథకం అర్హతలు ఇవే!

Bandaru Satyaprasad HT Telugu
Updated Jul 20, 2024 03:05 PM IST

Rajiv Gandhi Civils Abhayahastam Guidelines : తెలంగాణ ప్రభుత్వం సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం అర్హతలు ఇలా ఉన్నాయి.

సివిల్స్ పాసైతే రూ. లక్ష ఆర్థిక సాయం, ఈ పథకం అర్హతలు ఇవే!
సివిల్స్ పాసైతే రూ. లక్ష ఆర్థిక సాయం, ఈ పథకం అర్హతలు ఇవే!

Rajiv Gandhi Civils Abhayahastam Guidelines : తెలంగాణ ప్రభుత్వం సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైతే అర్హులందరికీ రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పేరుతో అమలు చేస్తుంది. అయితే ఈ పథకానికి అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అర్హతలు

  • అభ్యర్థులు జనరల్(ఈడబ్ల్యూఎస్ కోటా)/బీసీ/ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి
  • అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయ్యి ఉండాలి.
  • యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించాలి.
  • వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
  • గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు.
  • అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సహ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు దాదాపుగా 14 లక్షల మంది రాస్తున్నట్లు అంచనా. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి సుమారు 50 వేల మంది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో సుమారుగా 400 నుంచి 500 వరకు ప్రిలిమ్స్ లో అర్హత సాధిస్తున్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా అర్హులైన సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది.

ఏటా జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించబోతున్నామని చెప్పారు. ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.

సరైన సమయానికి పరీక్షలు నిర్వహణ

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. సింగరేణి కాలరీస్ సహకారంతో సివిల్స్‌లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. "నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తుందని ముందు ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ ప్రభుత్వం కచ్చితంగా, సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి సమర్థులైన వారిని ఎంపిక చేస్తుందన్న నమ్మకం రావాలి. ఎంపికలోనూ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మహిళా రిజర్వేషన్లు పాటిస్తుంది. ఎలాంటి అపనమ్మకాలు అవసరం లేదన్న భావన రావాలి. సంస్థపై నమ్మకం ఉంటే నిరుద్యోగుల ఫోకస్ అంతా ప్రపిరేషన్‌పై ఉంటుంది” అని వివరించారు. గ్రూప్ I, II, III, ప్యారా మెడికల్, పోలీస్, డీఎస్సీ, టెట్... ఇలా ఏ పరీక్షలైనా సరైన సమయంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యతగా సీఎం చెప్పారు. కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుతుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిన విషయాన్ని గుర్తుచేస్తూ దాన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

నాడు తెలంగాణ అంటే నిరుద్యోగానికి పర్యాయపదంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 20, 22 ఏళ్ల వయసున్న యువకులు ఉద్యోగం కోసం గత పదేళ్లలో ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆనాడు జరిగిన అనేక పొరపాట్లు జరిగాయన్నారు. ఏ పరీక్షా సమయానికి జరక్క, పరీక్షా పత్రాలు లీకై పల్లి బఠాణీల్లా మార్కెట్‌లో దొరకడంతో వారిలో నమ్మకం సన్నగిల్లడమే కాకుండా వారి జీవితంలో పదేళ్ల విలువైన కాలం వృధా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి యూపీఎస్సీ 2024 లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి అభినందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం