TG DSC Update : డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే, వాయిదాపై విద్యాశాఖ క్లారిటీ
TG DSC Update : డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించింది.
TG DSC Update : తెలంగాణలో డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడతాయా? నిర్వహిస్తారా? అనే సందేహంలో అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. డీఎస్సీ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవలే తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్‌కు, డీఎస్సీ విభిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సోమవారం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని, ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. అయితే ఇప్పటికే డీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్షలకు స్లాట్‌లు కూడా ఖరారు కావడంతో డీఎస్సీని వాయిదా వేయలేమని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్
డీఎస్సీ రాత పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని సోమవారం హైదరాబాద్ లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. దీంతో లక్డీకాపూల్‌లోని విద్యాశాఖ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
డీఎస్సీ షెడ్యూల్ ఇలా
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో సీబీఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జులై 18న మొదటి షిఫ్ట్ లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జులై 24న స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్‌టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి.
సంబంధిత కథనం