TG Govt Amnesty for prisoners : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష-hyderabad tg govt amnesty for prisoners governor approved 213 released for jail ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Amnesty For Prisoners : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష

TG Govt Amnesty for prisoners : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష

Bandaru Satyaprasad HT Telugu
Published Jul 02, 2024 09:10 PM IST

TG Govt Amnesty for prisoners : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సత్ప్రర్తన కలిగిన 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రతిపాదించగా, గవర్నర్ ఆమోదించారు.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష

TG Govt Amnesty for prisoners : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 213 మంది ఖైదీల‌కు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలంటూ ఖైదీల కుటుంబ స‌భ్యులు సీం రేవంత్ రెడ్డికి ప్రజా పాల‌నలో ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గద‌ర్శకాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించిన సీనియ‌ర్ అధికారులు, అర్హులైన వారి వివ‌రాల‌ను హైలెవ‌ల్ క‌మిటీ ముందుంచారు. హైలెవ‌ల్ క‌మిటీ విడుద‌ల‌కు అర్హులైన ఖైదీల జాబితాను కేబినెట్ ముందు ఉంచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఖైదీల విడుద‌ల‌కు ఆమోద‌ముద్ర వేసింది. అనంత‌రం ఆ జాబితాకు గ‌వ‌ర్నర్ ఆమోద ముద్ర వేయ‌డంతో ఖైదీల ముంద‌స్తు విడుద‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు చ‌ర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు బుధ‌వారం విడుద‌ల కానున్నారు. వీరిలో 205 మంది యావ‌జ్జీవ శిక్ష ప‌డిన ఖైదీలు, ఎనిమిది మంది త‌క్కువ కాలం శిక్షప‌డిన వారు ఉన్నారు. వీరంద‌రికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన‌ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. మెరుగైన ప్రవ‌ర్తన ద్వారా సమాజంలో తిరిగి క‌లిసిపోవ‌డానికి వారంద‌రికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.

ఖైదీలందరికీ ఉపాధి కల్పించాలి

ఖైదీలు ఒక్కొక్కరు రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని, ప్రతి 3 నెలలకు జిల్లా ప్రొబేషన్‌ అధికారి ముందు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. అలాగే జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్‌ కార్యాలయం సూచించినట్లు సమాచారం. జైళ్ల శాఖ నిర్వహిస్తోన్న పెట్రోల్‌ బంక్‌లు, ఇతర చోట్ల ఉపాధి కల్పించాలని సూచించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల అయ్యే ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యమిశ్రా బుధవారం మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు.

ఇప్పటి రెండు సార్లు మాత్రమే

సాధారణంగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేవారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ఖైదీలను సత్ప్రవర్తన కింద విడుదల చేశారు. 2016లో మొదటిసారిగా ఖైదీలను విడుదల చేయగా, రెండోసారి 2020 అక్టోబరు 2న 141 మందిని రిలీజ్ చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు పంపినా వివిధ కారణాలతో ఆమోదం లభించలేదు. 2024 జనవరిలో ఖైదీల విడుదలకు జైళ్ల శాఖ జాబితా సిద్ధం చేయగా, ఇప్పటికి మార్గం సుగమం అయ్యింది.

Whats_app_banner

సంబంధిత కథనం