Hyderabad restaurant: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఓ వీడియో, హైదరాబాద్ రెస్టారెంట్లలో అపరిశుభ్రతను వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని ‘అమృత్‌సర్ హవేలీ’ రెస్టారెంట్ బ్రాంచ్‌లో అపరిశుభ్రత, అనారోగ్యకరమైన పద్ధతులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. @foodsafetywar అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.
ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కి సర్వ్ చేస్తున్న ఆహారంలో మిగిలిపోయిన ఉల్లిపాయలు, చట్నీలను తిరిగి ఉపయోగిస్తున్నారని ఈ వీడియోలో ఆరోపించారు. ఇది హైదరాబాద్ హోటళ్లలో ఆహార భద్రత, పరిశుభ్రతలపై ఆందోళన రేకెత్తించింది. ఈ ఫుటేజ్‌లో రెస్టారెంట్ వాషింగ్ ఏరియాతో మొదలైంది. అక్కడ నీటితో నిండిన స్థలాన్ని చూపిస్తుంది, అక్కడే సిబ్బంది ఒకరు ఎంగిలి పాత్రలను శుభ్రం చేస్తున్నాడు. ప్లేట్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పునఃవినియోగంపై రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించాడు.
వీడియోలో, మిగిలిపోయిన ఉల్లిపాయలు, చట్నీలను ఉపయోగించని భాగాలతో ఎందుకు కలుపుతున్నారని ఒక వెయిటర్‌ని ప్రశ్నించడం వినిపిస్తుంది. ప్రారంభంలో, వెయిటర్ ఆరోపణలను ఖండించాడు. ఈ ఉల్లిపాయలు ఉపయోగించారని, మరొక టేబుల్‌కి వెళ్లవని పేర్కొన్నాడు. అయితే, ఆ వ్యక్తి స్పష్టత కోసం పదపదే ప్రశ్నించడంతో చివరికి రెస్టారెంట్ మేనేజర్ వెనిగర్, ఉల్లిపాయలను తిరిగి ఉపయోగిస్తున్నట్టు అంగీకరించాడు.
రెస్టారెంట్ సిబ్బంది పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పడంతో కంటెంట్ రూపొందించిన వ్యక్తి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాఢు. మిగిలిపోయిన ఉల్లిపాయలను పారవేసే చెత్త డబ్బాను చూపించమని హోటల్ నిర్వాహకుల్ని ప్రశ్నించడం కనిపిస్తుంది. అపరిశుభ్రతపై ఇన్‌స్టా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.