Hyderabad News : కస్టమర్ కు ఉచిత తాగు నీరు ఇవ్వని రెస్టారెంట్, రూ.5 వేల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశం
Hyderabad News : హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్(Hyderabad Restaurant) కస్టమర్ కు ఉచిత తాగునీరు అందించని కారణంతో రూ.5 వేల పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఈటరీస్ తప్పనిసరిగా ఉచిత తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపింది.
Hyderabad News : హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో కస్టమర్ కు ఉచిత తాగునీరు అందించని కారణంగా..వినియోగదారుల కమిషన్ అతడికి రూ.5 వేల ఇవ్వాలని ఆదేశించింది. రెస్టారెంట్ లో ఉచిత తాగు నీరులు ఇవ్వకపోవడంతో పాటు సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడంతో ఓ కస్టమర్ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. జూబ్లీహిల్స్ చెందిన రెస్టారెంట్ 45 రోజుల్లోగా కస్టమర్ కు రూ.5 వేల పరిహారం చెల్లించాలని హైదరాబాద్ లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
అసలేం జరిగింది?
హైదరాబాద్(Hyderabad) లోని సీబీఐ కాలనీ ఐటీఎల్ యూ రెస్టారెంట్ కు వెళ్లాడు కస్టమర్. తనకు ప్లాస్టిక్ పదార్థాల అలర్జీ ఉందని, సాధారణ నీరు కావాలని రెస్టారెంట్ సిబ్బంది కోరారు. తాగునీరు అందించేందుకు రెస్టారెంట్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తి వాటర్ బాటిల్ ను రూ.50 చెల్లించి కొనుగోలు చేశాడు. రెస్టారెంట్ రూ .630 బిల్లు అవ్వగా... రూ .31.50 సర్వీస్ ఛార్జీలు 5 శాతం సీజీఎస్టీ(CGST), ఎస్జీఎస్టీ(SGST) వసూలు చేశారు. దీంతో మొత్తం బిల్లు రూ .695 అయ్యిందని కస్టమర్ చెప్పారు.
కమిషన్ ఉత్తర్వుల్లో ఏముంది?
ఈ విషయంపై కస్టమర్... వినియోగదారులు కమిషన్(Consumer Disputes Commission) ను ఆశ్రయించాడు. దీంతో జీఎస్టీతో(GST) పాటు సర్వీస్ ఛార్జీని తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అలాగే కస్టమర్ కు 45 రోజుల్లో రూ.5,000 పరిహారం చెల్లించాలని రెస్టారెంట్ ను ఆదేశించింది. అలాగే రూ.1,000 లిటిగేషన్ ఖర్చులను భరించాలని రెస్టారెంట్ ను ఆదేశించింది. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు(Restaurants), తినుబండారాలు ఉచితంగా తాగు నీటిని, ఎంఆర్పీ ధరలో బాటిల్ వాటర్(Water Bottle) ను అందించాలని తెలంగాణ ప్రభుత్వ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గత ఏడాది ఆదేశించిన విషయం తెలిసిందే.