పార్కులను ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్న కాలనీ సంఘాలు, హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ-hyderabad resident welfare associations selling park lands complaints to hydra prajavani ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  పార్కులను ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్న కాలనీ సంఘాలు, హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

పార్కులను ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్న కాలనీ సంఘాలు, హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

చెరువులు, ప్రభుత్వ స్థలాలతో పాటు కాలనీల్లో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు మాయం చేస్తున్నారు. కాలనీలను కాపాడాల్సిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు పార్కులను ప్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. హైడ్రా ప్రజావాణిలో ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

పార్కులను ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్న కాలనీ సంఘాలు, హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

పార్కులు, ర‌హ‌దారులు, ప్రజావ‌స‌రాల‌ కోసం కేటాయించిన స్థలాల‌ను కాపాడాల్సిన కాల‌నీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే వాటిని ఆక్రమిస్తున్నారు. ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ను వ్యాపారుల‌కు దారాద‌త్తం చేయ‌డం లేదా ప్లాట్లుగా ప‌త్రాలు సృష్టించి అమ్మేస్తున్నారు.

బ‌స్తీ, కాల‌నీ సంక్షేమ సంఘాల నాయ‌కులుగా చెలామ‌ణి అవుతూ పార్కుల స్థలాలు కొట్టేస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించి లే ఔట్‌ల‌లో కేటాయించిన స్థలాలను ఏదో ఒక రూపంలో అమ్మేస్తున్నారంటూ ప‌లువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాల‌నీవాసులకు వాటిపై హ‌క్కు లేకుండా చేస్తున్నార‌ని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

నిజాంపేట మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో స‌ర్వే నంబ‌రు 181, 183 ప‌రిధిలోని సాయిల‌క్ష్మి లేఔట్‌లోని 1800 గ‌జాల పార్కు స్థలం క‌బ్జా అయ్యిందంటూ ప్రజావాణిలో ఫిర్యాదు అందింది.

లే ఔట్ల స్థలాలు మాయం

ఇదే కార్పొరేష‌న్ ప‌రిధిలోని స‌ర్వే నంబ‌రు 153, 154, 155లో కూడా దాదాపు 5 ఎక‌రాల వ‌ర‌కూ ఉన్న పార్కు స్థలాలు, ర‌హ‌దారులు క‌నిపించ‌డంలేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే 2.3 ఎక‌రాల వీఎన్ఆర్ పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్నార‌ని ఫిర్యాదు చేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలే కాదు.. ఆఖరికి కాల‌నీ లే ఔట్లలోని స్థలాల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

బాధితుల ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డ‌మే కాకుండా.. గూగుల్ మ్యాప్స్‌ ద్వారా అక్కడి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ప‌లు సూచ‌న‌లు చేశారు. సోమ‌వారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 61 ఫిర్యాదులందాయని హైడ్రా పేర్కొంది.

హైకోర్టు తీర్పు బేఖాతరు

ఏకంగా లే ఔట్‌నే మాయం చేశారంటూ కూక‌ట్‌ప‌ల్లి హైద‌ర్‌న‌గ‌ర్‌లోని డైమండ్ హిల్స్ కాల‌నీ ప్లాట్ల య‌జ‌మానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 9 ఎక‌రాల విస్తీర్ణంలో 70 రెసిడెన్షియ‌ల్ ప్లాట్లతో ఉన్న లే ఔట్‌ను మొత్తం చెరిపేసి.. త‌న ఆధీనంలోకి తీసుకున్నార‌ని ఆరోపించారు.

2024లో హైకోర్టులో త‌మ‌కు అనుకూలంగా తీర్పునిచ్చినా... వారిని ఖాళీ చేయించ‌లేక‌పోతున్నామ‌ని వాపోయారు. లే ఔట్‌లోని ర‌హ‌దారులు, పార్కులు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు.

మేడ్చల్-మ‌ల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని దేవ‌ర‌యాంజ‌ల్ గ్రామంలో జాతీయ ర‌హ‌దారితో పాటు.. ఓఆర్ఆర్ ను క‌లుపుతూ కండ్లకోయ‌, దేవ‌ర‌యాంజ‌ల్ మ‌ధ్య ఉన్న40 అడుగుల‌ ర‌హ‌దారికి అడ్డంగా ప్రహరీ నిర్మించి రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.

జీహెచ్ఎంసీ పార్క్ మాయం

హ‌య‌త్‌న‌గ‌ర్‌ అనుమ‌గ‌ల్‌లోని తిరుమ‌ల హౌసింగ్ కాల‌నీలోని 2955 గ‌జాల‌ జీహెచ్ఎంసీ పార్కును కొంత‌మంది వ్యక్తులు క‌బ్జా చేశారు. ఈ పార్కు అభివృద్ధికి రూ. 1.20 కోట్లతో అభివృద్ధి చేయ‌డానికి చేస్తున్న ప్రయ‌త్నాల‌ను కూడా అడ్డుకున్నారు.

హైకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టు కూడా క‌బ్జా దారుల‌కు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా వ‌ద‌ల‌డంలేద‌ని ప‌లువురు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

మేడ్చల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట కార్పోరేష‌న్ ప‌రిధిలోని తుర్కచెరువులోని ఎఫ్‌టీఎల్ ల్యాండ్‌తో పాటు.. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని హైడ్రాకు ఫిర్యాదు అందింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం