Hyderabad Real Estate : ఓఆర్ఆర్ దాటిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్, జోరందుకున్న గృహవిక్రయాలు
Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దూసుకుపోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో(జులై-సెప్టెంబర్) నగరంలో 12700 ఇండ్లు అమ్ముడయ్యాయి. వెస్ట్ హైదరాబాద్ లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. గృహ విక్రయాలు క్రమంగా స్పీడందుకుంటున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం జులై-సెప్టెంబర్ మధ్య నగరంలో 12700 ఇండ్లు అమ్ముడు పోయాయి. మరో 13900 యూనిట్లు విక్రయానికి రెడీ అయ్యాయి. అయితే రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇండ్ల విక్రయాలు 16 శాతం క్షీణించాయి. కొత్త యూనిట్లు ఒక శాతం పెరిగాయని అనరాక్ అధ్యయనం ప్రకటించింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్వార్టర్ లో మొత్తం ఇళ్ల అమ్మకాల్లో 53 శాతం వెస్ట్ జోన్ లోనే జరిగాయి. అనంతరం నార్త్ జోన్ లో 28 శాతం, సౌత్ జోన్ లో 13, ఈస్ట్ జోన్ లో 4 శాతం గృహాలు అమ్ముడయ్యాయి. ఇక సెంట్రల్ హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు ఒక శాతంగా ఉన్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరల్లోని ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 12 శాతంగా ఉంది.
పెరిగిన అద్దెలు
హైదరాబాద్ నగరంలో అపార్ట్‌మెంట్ల ఒక చదరపు అడుగు ధర సగటున రూ.7,150 లుగా ఉందని అనరాక్ సంస్థ తెలిపింది. మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో లక్షల గృహాల ఇన్వెంటరీ ఉందని సమాచారం. నగరంలో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటిందని ఈ సర్వే సంస్థ తెలిపింది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం హైదరాబాద్ నగరానిదే ఉంది. ఇందులో వెస్ట్ హైదరాబాద్ దే హవా. నగరంలో గత మూడు నెలల్లో ఇళ్ల అద్దెలు 1 నుంచి 4 శాతం, అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు ధరలు 3 నుంచి 5 శాతం మేర పెరిగాయని తెలుస్తోంది. చదరపు అడుగు ధర సగటున ఎల్బీనగర్ లో రూ.6800, మియాపూర్ లో 6700, గచ్చిబౌలీలో రూ.8900, కొండాపూర్ లో రూ.8600గా ఉంది. డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇండ్ల అద్దెలు నెలకు రూ.14-42 వేల మధ్యలో ఉన్నాయి.
మూడో త్రైమాసికంలో నగరంలో 13900 ఇండ్ల యూనిట్లు విక్రయానికి సిద్ధం కాగా.. వీటిల్లో లగ్జరీ గృహాల వాటా అత్యధికంగా ఉంది. వీటిల్లో 60 శాతం ఇండ్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం గృహాలే ఉన్నాయి. రూ.40 నుంచి 80 లక్షల ధర ఉన్న ఇండ్లు 3 శాతం, రూ.80 లక్షల-రూ.1.5 కోట్ల ధర ఉన్న యూనిట్ల వాటా 37 శాతం, రూ.1.5 నుంచి 2.5 కోట్ల ధర ఉన్న ఇండ్ల వాటా 40 శాతం, రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఇండ్ల యూనిట్ల వాటా 20 శాతంగా ఉందని అనరాక్ సంస్థ తెలిపింది.
రింగ్ రోడ్డు దాటిన రియల్ ఎస్టేట్ వ్యాపారం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి పెట్టింది పేరు. దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో హైదరాబాద్ కు గణనీయమైన వాటా ఉంది. అయితే నగరంలో రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయింది. ప్రధానంగా ఇండ్ల స్థలాలు, ఇండిపెండెంట్ హౌస్‌లు రింగ్ రోడ్డు అవతల ఎక్కువగా లభ్యమవుతున్నాయి. విల్లాలు ఎక్కువగా ఔటర్ రింగ్ రోడ్ తర్వాతనే నిర్మిస్తున్నారు. పదేళ్లలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డును దాటి నగరం విస్తరించింది. విజయవాడ, ముంబయి, నాగపూర్, శ్రీశైలం హైవేల సమీపంలో ఔటర్ ఎగ్జిట్ నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఈ ఏరియాలో ధరలు క్రమంలో పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ మధ్యతరగతికి అందుబాటులో ధరలు ఉన్నాయి. చిరుద్యోగులు కొనుగోలు చేసేలా అపార్టుమెంట్లు ఉన్నాయి. ఉద్యోగులు సైతం కొనుగోలు చేసేలా ఇండిపెండెంట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం