Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరు, అక్టోబర్ లో 20 శాతం పెరిగిన రిజిస్ట్రేషన్లు
Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జోరు కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో హైదరాబాద్ స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 20 శాతం మేర పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సర్వే తెలిపింది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. గడచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. అక్టోబర్‌లో హైదరాబాద్ లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 20 శాతం పెరిగాయని, రియల్ ఎస్టేట్ మార్కెట్ కార్యకలాపాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను కనిపించిందని ఈ సంస్థ సర్వే రిపోర్టు తెలిపింది. అక్టోబర్ నెలలో మొత్తం 5,985 రెసిడెన్షియల్ యూనిట్లు విక్రయించారు. రూ. 3,617 కోట్ల గృహాల అమ్మకాలు జరిగాయని సర్వే తెలిపింది. హైదరాబాద్ నగరంలో నివాస ప్రాపర్టీ లావాదేవీలలో ఏడాదికి 14 శాతం పెరుగుదల నమోదు అవుతున్నట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది.
ఆగస్టు, సెప్టెంబరులో రియల్ ఎస్టేట్ అమ్మకాలు క్షీణించాయని, అయితే అక్టోబర్ బలమైన రికవరీ సాధించినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. ఆగస్టులో 27 శాతం, సెప్టెంబరులో 24 శాతం రియల్ ఎస్టేట్ విక్రయాలు క్షీణించాయి. అక్టోబర్‌లో 20 శాతం స్థిరాస్తి మార్కెట్ పుంజుకున్నట్లు సర్వేలో స్పష్టమైంది.
అక్టోబర్ నెలలో రంగారెడ్డి 43 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 41 శాతం, హైదరాబాద్ 16 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇండ్ల విక్రయాలు బలంగా ఉన్నాయి. 59 శాతం గృహాలు రూ. 50 లక్షల కంటే తక్కువ ధరకు విక్రయించారు. అలాగే ప్రీమియం ఇళ్ల కొనుగోలుపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే రూ. 1 కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 36 శాతం పెరిగాయి. దీంతో పాటు పెద్ద ఇళ్లకు అంటే 2 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఇండ్లకు డిమాండ్ పెరిగిందని ఈ సంస్థ తెలిపింది. వీటి రిజిస్ట్రేషన్లలో 12 శాతం పెరిగిందని పేర్కొంది. ఇది గత సంవత్సరంలో 11 శాతంగా ఉందని వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే 17 శాతం
హైదరాబాద్‌లో రెసిడెన్సియల్ ప్రాపర్టీల సగటు ధర కూడా అక్టోబర్‌లో 7 శాతం పెరిగింది. సంగారెడ్డిలో 13 శాతం పెరుగుదలలో నమోదైంది. ఆగస్టు నెలలో హైదరాబాద్ లో 6439 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.4043 కోట్లు. గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 17 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. తాజా లెక్కలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని అర్థమవుతోంది.
గడచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ అన్ రాక్ ప్రకటించింది. 2023 - 2024 ప్రథమార్థంతో పోల్చితే 2024 - 25 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల ధరలు 37 శాతం పెరిగాయని అన్ రాక్ విశ్లేషించింది.
సంబంధిత కథనం