KTR Vs Bandi Sanjay : రజాకార్ సినిమాపై కేటీఆర్ రియాక్షన్, ఇది ట్రైలర్ మాత్రమేనని బండి సంజయ్ కౌంటర్
KTR Vs Bandi Sanjay : రజాకార్ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
KTR Vs Bandi Sanjay : తెలంగాణ విమోచనం నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలు, రజాకార్ల దాష్టికాన్ని తెలియజేస్తూ రజాకార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవరం సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను ఆదివారం విడుదల చేశారు. ఈ టీజర్ లో రజాకార్లు తెలంగాణ ప్రజలకు చేసిన దారుణ ఘటనలను చూపించారు. ముఖ్యంగా హిందువులపై దాడులను హైలెట్ చేసింది. ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రజాకార్ టీజర్ ను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై స్పందించిన మంత్రి కేటీఆర్... బీజేపీకి చెందిన కొంతమంది తమ రాజకీయ ప్రచారం కోసం మతహింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు.
ట్రెండింగ్ వార్తలు
బండి సంజయ్ కౌంటర్
మంత్రి కేటీఆర్ రజాకార్ మూవీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు ట్రాక్ మార్చిందని ఆరోపించారు. రజాకార్లు దాష్టికాలను చూపించగానే ట్విట్టర్ టిల్లుకు సమస్యగా మారిందని మండిపడ్డారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. హిందువుల పండుగ వినాయక చవితికి శుభాకాంక్షలు చెప్పలేదు, కానీ రజాకార్ల హిందూ మారణహోమాన్ని చూపించిన సినిమాపై దాడికి సిద్ధమయ్యారని కేటీఆర్ పై విమర్శలు చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు కేటీఆర్ కు కొంత స్పృహను కలిగించాలని అందరూ గణనాథుడిని ప్రార్థిద్దాం అంటూ బండి సంజయ్ కౌంటర్ వేశారు.
వివాదాస్పదంగా రజాకార్ చిత్రం
రజాకార్ -ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ చిత్రం వివాదాస్పదంగా మారింది. సెప్టెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం టీజర్ తో వివాదం మరింత ముదిరింది. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తరహాలో ఈ సినిమా కూడా వివాదాస్పదం అవుతుందని సినీ, రాజకీయ వర్గాలు అంటున్నాయి. నిజాం పాలనలో రజాకార్ల దారుణాలను, వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తీశామని చిత్ర యూనిట్ అంటోంది. అయితే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని సినిమా తీశారని ఓ వర్గం ఆరోపిస్తుంది. ఈ సినిమా పోస్టర్‌ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, బీజేపీ నేతలు విడుదల చేసినప్పుడూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా రజాకార్ టీజర్ పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలే లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.