Goa Trip Fail : ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం, గోవా ట్రిప్ క్యాన్సిల్- రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ప్రయాణికులు
Goa Trip Fail : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, యాజమాన్యం నిర్వాకంతో 25 మంది ప్రయాణికుల గోవా ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. బస్సులో సౌకర్యాలు సరిగ్గా లేవని ప్రశ్నించినందుకు రోడ్డు పక్కన బస్సు నిలిపివేశాడు డ్రైవర్. ఎంత సేపటికీ బస్సు తీయకపోవడంతో ప్రయాణికులు పోలీసులను ఆశ్రయించారు.
Goa Trip Fail : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల గోవా ట్రిప్ కి వెళ్లాల్సిన ప్రయాణికుల ఆశ నిరాశగానే మిగిలిపోయింది. బస్సులో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రయాణికులు ప్రశ్నించడంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి గోవాకు బయలుదేరే ఓంశ్రీ ట్రావెల్స్ బస్సుకు హైదరాబాద్ కు చెందిన 25 మంది ప్రయాణికులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. కాగా బస్సు నిర్వాహకులు ప్రయాణికులను ఎల్బీ నగర్ కు వెళ్లి ఎక్కించుకోవాలి. కానీ వారు ప్రయాణికులను మియాపూర్ వచ్చి బస్సు ఎక్కాలని కోరారు. దీంతో ప్రయాణికులు సోమవారం రాత్రి మియాపూర్ వచ్చి బస్సు ఎక్కారు.
కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నించడంతో
గోవాకు వెళ్లాల్సిన 25 మంది ప్రయాణికులు బస్సు ఎక్కారు. దీంతో బస్సు ప్రయాణం ప్రారంభమయ్యింది. కానీ బస్సులో కనీస సౌకర్యాలు లేకపోవడం, ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడం, బస్సు లోపల అపరిశుభ్రంగా ఉండడం, ఇతర సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులు డ్రైవర్ ను ప్రశ్నించారు. అతడు ప్రయాణికులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఆగ్రహంతో బస్సును రామచంద్రపురం అశోక్ నగర్ వద్ద రోడ్డు పక్కన బస్సును ఆపి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.
బస్సు నిర్వాహకులపై ఫిర్యాదు
దీంతో ప్రయాణికులు బస్సు నిర్వాహకుడికి ఫోన్ చేయగా అతడు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం ఇచ్చాడు. ఇది గమనించిన ప్రయాణికులు డయల్ 100 కు కాల్ చేశారు. వెంటనే ఆర్సీపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని డ్రైవరును, బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ప్రయాణికులు రాత్రంతా బస్సులోనే పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వచ్చింది. డ్రైవర్ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. దీంతో బస్సు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విమానంలో ఇంటర్వ్యూ కి వెళ్లిన ప్రయాణికుడు
ప్రయాణికులలో ఒకరైన వైజాగ్ కు చెందిన చరణ్ వర్మ మే 22న బుధవారం గోవాలో జరిగే ఇండియన్ కోస్ట్ గార్డ్ లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది. కావున బస్సు ఇక్కడే ఆగిపోవడంతో అతడు ఇబ్బందికి గురయ్యాడు. దీంతో తోటి ప్రయాణికులు అందరూ కలిసి మంగళవారం రాత్రి గోవాకు వెళ్లేందుకు చరణ్ వర్మకు విమాన టికెట్ బుక్ చేశారు. దీంతో అతడు ఇంటర్వ్యూ కి వెళ్లాడు. కాగా చరణ్ వర్మ తోటి ప్రయాణికులు అందరికీ కృతజ్ఞత తెలిపాడు.