CM KCR Dasara Celebrations : హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సోమవారం విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సంప్రదాయ పద్ధతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.
శుభసూచకంగా భావించే పాలపిట్టను సీఎం కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షుతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.
తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను 'విజయ దశమి' పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం తెలిపారు. దసరా నాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని సీఎం అన్నారు.
శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని ప్రయత్నం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్ దుర్గామాతను ప్రార్థించారు.