Hyderabad Police : ఫేక్ లోన్ యాప్స్‌తో జరభద్రం.. ఆశపడ్డారో అంతే సంగతులు!
Hyderabad Police : అమాయకుల ఆర్థిక అవసరాలు.. సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. రోజురోజుకూ లోన్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో చాలా ఫేక్ యాప్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా రుణాలు ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. వాటిని నమ్మి జనం మోసపోతున్నారు.
ఈమధ్య కాలంలో లోన్ యాప్‌ల వేధింపులకు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువగా యువత, విద్యార్థులు, మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. తీసుకున్న రుణం పూర్తిగా తిరిగి చెల్లించినా.. ఇంకా బాకీ ఉందంటూ ఫొటోలు మార్ఫింగ్ చేసి సైబర్ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు.

పోలీసుల హెచ్చరిక..
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. 'ఫేక్ లోన్ యాప్స్‌తో జరభద్రం. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్స్ అంటే ఆశ పడకండి. నకిలీ లోన్ యాప్స్‌ని నమ్మకండి. ఫేక్ లోన్ యాప్స్ మిమ్మల్ని సర్వం దోచేస్తాయి. మీ ఫోన్ లోని వివరాలను సర్వర్‌లో లోడ్ చేసుకుంటాయి. ఈజీగా లోన్ వస్తుందని వెళ్లి చిక్కుల్లో పడకండి. ఫేక్ లోన్ యాప్స్‌పై అవగాహన కల్పించండి. ఎలాంటి ఫ్రాడ్ మీ దృష్టికి వచ్చినా.. 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి' అని పోలీసులు సూచించారు.
వేధింపులు ఎదురైతే..
ఫొటోల మార్ఫింగ్, లోన్ యాప్ వేధింపులు ఎదురైతే.. భయపడకుండా ఫిర్యాదు చేయాలని.. పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బాధితులకు అండగా నిలిచి అవసరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అటు సోషల్ మీడియా విషయంలో యువత అప్రత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోలు అప్‌లోడ్ చేయకపోవడమే మంచిదని.. ఒక వేళ చేసినా ఇతరులకు వాటి యాక్సెస్ లేకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేస్తున్నారు.
దీని గురించి తెలుసుకోండి..
2015లో www.stopncii.org అనే సైట్ అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చింది. మనం అప్‌లోడ్ చేసిన ఫొటోలను డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం లాంటివి ఉండవు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ తరహాలో మన చిత్రంతో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. దాని ఆధారంగా సోషల్ మీడియాలో మన ఫోటోలు అప్‌లోడ్ అయితే.. గుర్తించి క్షణాల్లో తొలగిస్తుంది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా 2 లక్షల మందికి పైగా బాధితుల మార్ఫింగ్ చిత్రాలను తొలగించి వారికి రక్షణ కల్పించింది ఈ వెబ్ సైట్.