Hyderabad police : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. అవాక్కైన హైదరాబాద్ పోలీసులు.. మరీ ఇంత తాగావేంటి బ్రో!-hyderabad police stunned by drinker breath test results during drink and drive check ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Police : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. అవాక్కైన హైదరాబాద్ పోలీసులు.. మరీ ఇంత తాగావేంటి బ్రో!

Hyderabad police : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. అవాక్కైన హైదరాబాద్ పోలీసులు.. మరీ ఇంత తాగావేంటి బ్రో!

Basani Shiva Kumar HT Telugu
Jan 03, 2025 11:51 AM IST

Hyderabad police : న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తికి వచ్చిన శ్వాస పరీక్ష ఫలితాలను చూసి.. పోలీసులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

హైదరాబాద్ పోలీసులు డిసెంబర్ 31న రాత్రి పదిన్నర గంటల సమయంలో.. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వెంగళరావు పార్క్ సమీపంలో టెస్టులు చేస్తున్న పోలీసులు ఓ బైక్‌ను ఆపారు. బైక్ నడిపిన వ్యక్తికి బ్రీత్‌ అనలైజింగ్ టెస్టు చేశారు. రీడింగ్‌ను పోలీసులు ఆశ్యర్యపోయారు.

yearly horoscope entry point

ఎంత తాగారు బ్రో..

పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో.. TS 09 EK 3617 నంబర్ ప్లేట్ ఉన్న బైక్ నడుపుతున్న వ్యక్తిని ఆపారు. అతనికి బ్రీత్‌అనలైజర్ టెస్టు చేశారు. దాని రీడింగ్‌ను చూసి పోలీసులు అవాక్కయ్యారు. 550 ఎంజీ/100ఎంఎల్ రీడింగ్ చూపడంతో ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజన్లు స్పందించారు. "బ్రదర్, మీరు ఎంత తాగారు?.. ఏంటీ బ్రో ఇంత తాగావా.. ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్" అంటూ కామెంట్స్ చేశారు.

సంఖ్య పెరిగింది..

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనం నడిపిన వారి సంఖ్య పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులే ఈ కేసుల్లో ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసుల్లో ఎక్కువమంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. నమోదైన 619 కేసుల్లో 526 కేసులు బైక్‌లకు సంబంధించినవే కావడం గమనార్హం. 64 మంది నాలుగు చక్రాల వాహనాలు నడపగా.. 26 మంది మూడు చక్రాల వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

మహిళలు లేరు..

హైదరాబాద్‌లోని రాచకొండ పరిధిలో లారీలు లేదా ట్రక్కులకు సంబంధించిన కేసులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అన్ని రకాల వాహనాలకు సంబంధించిన కేసుల్లో ఏ ఒక్క మహిళ కూడా పోలీసులకు పట్టుబడలేదు. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు.. మద్యం తాగి వాహనాలు నడపడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు, ఉల్లంఘనలను అరికట్టడానికి చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువమంది యువకులు పోలీసులకు చిక్కారు.

ఈ వయస్సు వారే ఎక్కువ..

హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో.. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారి వయస్సు వారీగా లెక్కలు చూస్తే.. అత్యధికంగా 262 మంది 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు. ఆ తర్వాత 31 నుంచి 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తులపై 201 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 41 నుంచి 50 ఏళ్ల వయస్సు గలవారిపై 109 కేసులు నమోదయ్యాయి. 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 30 మంది, 61 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 3 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు గలవారిపై 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మైనర్లపై 2 కేసులు నమోదు చేశారు.

Whats_app_banner