హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను, 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు.
"హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున ట్రాఫిక్‌కు సంబంధించిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించాం. ట్రాఫిక్ ఫోరమ్ కృషితో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను, 50 ట్రాఫిక్ బైక్‌లను ప్రారంభించాం. వీటన్నింటినీ ప్రైవేట్ సంస్థలు అందించాయి. ఈ బైక్‌లు ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయి. త్వరలో మరో 500 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను, 100 బైక్‌లను తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించాం" అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
సీపీ సి.వి. ఆనంద్ తన ఎక్స్ పోస్ట్‌లో ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు పంచుకున్నారు. ఈ చొరవ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో అనేక కార్పొరేట్, పౌర సంస్థల సహకారంతో చేపట్టినట్లు ఆయన తెలిపారు.
తాజాగా ప్రవేశపెట్టిన పెట్రోలింగ్ బైక్‌లు (బజాజ్ అవెంజర్ 220 క్రూజ్) అధునాతన సాంకేతికతతో రూపొందించినవి. వీటిలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ (PA), జీపీఎస్ ట్రాకింగ్, డాష్‌బోర్డ్, బాడీ-వోర్న్ కెమెరాలు వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లు ట్రాఫిక్ నియంత్రణకు, నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అత్యవసర పరిస్థితులకు త్వరగా స్పందించడానికి ట్రాఫిక్ పోలీసులకు సహాయపడతాయి.
ట్రాఫిక్ మార్షల్స్‌గా విధులు నిర్వర్తించేందుకు తొలిసారిగా భారతదేశంలోనే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను కూడా నియమించారు. ఎంపికైన 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పర్యవేక్షణలో ఉండి సహాయం చేయడానికి పంపించారు. వీరికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ మార్షల్స్ సంఖ్యను 500కు పెంచాలని పోలీసులు ప్రణాళికలు రచించారు.
టాపిక్