Allu Arjun : అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. కారణం ఇదే అంటున్న పోలీసులు
Allu Arjun : హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్‌లో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించేందుకు బన్నీ వెళ్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. పరామర్శకు వస్తే జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని నోటీసుల్లో స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తారనే సమాచారంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
బాధ్యత మీదే..
ఒకవేళ బన్నీ పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్ రానున్నారు. పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం పీఎస్‌కు వెళ్లనున్నారు.
బన్నీకి బెయిల్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా కామెంట్స్ చేయొద్దని స్పష్టం చేసింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది.
బన్నీ రాకపోయి ఉంటే..
అల్లు అర్జున్‌కు బీఎన్‌ఎస్ యాక్ట్ 105 వర్తించదని ఆయన తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కారణం కాదని వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ప్రాంతానికి, అల్లు అర్జున్ వచ్చిన ప్రాంతానికి 30 మీటర్ల దూరం ఉందని చెప్పారు. అల్లు అర్జున్ రావడం వల్లే తోపులాట జరిగిందని, ఆయన రాకపోతే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని పోలీసుల తరఫున పీపీ వాదించారు. అల్లు అర్జున్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. అతనికి బెయిల్ మంజూరుచేస్తే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కోర్టుకు వివరించారు.
రెగ్యులర్ బెయిల్..
ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ సహా 18 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.