Sandhya Theater Stampede Case : తప్పుడు వీడియోలు మా దృష్టికి వచ్చాయి - సంథ్య థియేటర్ ఘటనపై పోలీసుల సీరియస్ వార్నింగ్..!
Sandhya Theater stampede incident : సంథ్య థియేటర్ ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టులు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ నగర పోలీసులు మరోసారి ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేయవద్దన్నారు.
కఠిన చర్యలు తప్పవు - పోలీసుల ప్రకటన
అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని తాజా ప్రకటనలో పోలీసులు హెచ్చరించారు.
ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని స్పష్టం చేశారు. “ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు” అని స్పష్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని తెలిపారు. కానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
అల్లు అర్జున్ విచారణ:
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను మంగళవారం చిక్కడపల్లి పోలీసులు విచారించారు. సుమారు 3.30 గంటల పాటు విచారణ సాగింది. తన తండ్రి అల్లు అర్వింద్, న్యాయవాదితో కలిసి మంగళవారం ఉదయం 11.05 గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వీరితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు.
ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అల్లు అర్జున్ ను విచారించారు. తొక్కిసలాట ఘటనపై ఇటీవల సీపీ సీవీ ఆనంద్ 10 నిమిషాల వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ ప్రశ్నలు అడిగినట్లు తెలుసింది. విచారణ అనంతరం అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో కొన్ని వీడియేలు సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రధానంగా అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయం, బయటికి వచ్చిన టైమ్ కు సంబంధించిన వీడియోలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోలు వైరల్ కావటంతో… పోలీసులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
సంబంధిత కథనం