vinayaka chavithi 2024: గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ గుర్తుంచుకొండి
vinayaka chavithi 2024: వినాయక చవితి.. ఊరు..వాడ అంతా ఏకమై ఈ పండుగను జరుపుకుంటారు. గల్లీ గల్లీకో గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేసి.. తమ భక్తిని చాటుకుంటారు. అయితే.. ఈ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా కొన్ని ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంది. అందుకే పోలీసులు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు.
గణేష్ పండుగ సమీపిస్తున్న తరుణంలో.. శాంతి భద్రతలను కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 17న మహా నిమజ్జన ఉరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. దీంతో పోలీసులు కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టారు. మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు మార్గదర్శకాలు రూపొందించారు. నిర్వాహకులు వాటిని ఫాలో అవ్వాలని స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో.. లేదా 8712665785 నెంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
నిబంధనలివే..
1.వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదు.
2.గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల యజమానుల నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి.
3.మండపాలకు అవసరమైన విద్యుత్తు ఏర్పాటుకు.. ఆ శాఖ నుంచి అనుమతి పొందాలి.
4.సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లపై నిషేధం ఉంటుంది.
5.సెల్లార్లు, కాంప్లెక్స్‌ల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల అనుమతి కచ్చితంగా ఉండాలి.
6.మండపాల వద్ద వాలంటీర్లు కార్డులు/బ్యాడ్జీలు ధరించాల్సి ఉంటుంది.
7.విగ్రహాలు ఊరేగింపుగా వెళ్లే మార్గం, సమయం వివరాలను ముందుగానే పోలీసులకు ఇవ్వాలి.
8.మండపాల వద్ద ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు ఉంచుకోవాలి.
9.మండపాల ఏర్పాటుకు సబంధించిన పత్రాలను జత చేసి ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ లోపు పోలీసుల వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
కచ్చితంగా పాటించాల్సిందే..
నిర్వాహకులు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.