బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, టేస్టీ తేజ, కిరణ్‌గౌడ్ విచారణ పూర్తయ్యింది. మరికొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. అటు పోలీసుల విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్ వంటి వారు దుబాయ్ వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చాలామంది సినీతారలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌తో సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా లబ్ధి పొందినట్టు సమాచారం. వీరికి ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందనే అంశంపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
మన దేశంలో బెట్టింగ్, జూదం చట్ట విరుద్ధం. కొన్ని రాష్ట్రాలు లాటరీ, గుర్రపు పందాలను అనుమతించినప్పటికీ.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు చట్టబద్ధం కాదని పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం అనేది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఇది నేరంగా పరిగణించబడుతుందని వివరిస్తున్నారు.
ప్రముఖ వ్యక్తులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఇతర వ్యక్తులు బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం ద్వారా.. చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు గతంలోనే హెచ్చరించారు. అయినా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. ఫలితంగా కేసులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది.
బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈజీగా డబ్బు సంపాదించవచ్చని భావిస్తారు. కానీ.. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకోవడం చాలా సులభం. దీనివల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. చాలా మంది బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకొని, అప్పుల పాలవుతున్నారు. అవి తీర్చలేక ఎందరో అమాయకులు ప్రాణాలు తీసుకున్నారు.
చాలా దేశాలు బెట్టింగ్ యాప్స్, జూదంపై నిషేధం విధించాయి. ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం.. వీటికి పెట్టింది పేరు. చాలా బెట్టింగ్ యాప్‌లు చైనా నుండి పనిచేస్తున్నాయి. మాల్టా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీలకు ప్రసిద్ధి చెందింది. సైప్రస్ కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఒక కేంద్రంగా ఉంది. క్యూరసావోలో అనేక బెట్టింగ్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా కొన్ని బెట్టింగ్ యాప్‌లు పనిచేస్తున్నాయని.. తెలుస్తోంది.
సంబంధిత కథనం