ganja chocolates: ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్.. పక్కా స్కెచ్‌తో పట్టుకున్న హైదరాబాద్ పోలీస్
ganja chocolates: గంజాయి స్మగ్లర్లు రోజుకో కొత్త దారి వెతుక్కుంటున్నారు. తమ దందా సాఫీగా సాగడానికి తాజాగా ఆన్‌లైన్ అమ్మకాలు స్టార్ట్ చేశారు. కానీ.. వారి తెలివితేటలు హైదరాబాద్ పోలీసుల ముందు పనిచేయలేదు. పక్కా స్కెచ్‌తో వారిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు.
ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్ జోరుగా సాగుతోంది. దానికి హైదరాబాద్ పోలీసులు తాజాగా అట్టుకట్ట వేశారు. గంజాయి చాక్లెట్స్ బిజినెస్ చేస్తున్నవారిని పట్టుకున్నారు. ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే.. కొన్ని సంస్థలు గంజాయి చాక్లెట్లను డెలివరీ చేస్తున్నాయి. దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టి.. పక్కా ఆధారాలతో ఆపరేషన్ డెకాయి నిర్వహించారు. టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
చాక్లెట్లను ఆర్డర్ పెట్టి..
ఇండియా మార్ట్‌లో ఈ గంజాయి చాక్లెట్లను ఆర్డర్ పెట్టిన సందీప్ శాండిల్యా బృందం.. ఆ చాక్లెట్లను పక్కాగా టెస్ట్ చేసి రాజస్థాన్, యూపీలో ఉన్న 8 కంపెనీలను గుర్తించింది. ఈ విషయాన్ని టీజీ ఏఎన్‌బీ అధికారులు ఎన్సీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వారితో కలిసి యూపీకి వెళ్లారు. అక్కడ గంజాయి చాక్లెట్లను అమ్మే ఇద్దరు కంపనీ యజమానులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లో 7 కంపెనీలను గుర్తించిన పోలీసులు, అక్కడి నుంచి నమూనాలు తీసుకొని ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
కిరాణా షాపుల్లోనూ గంజాయి చాక్లెట్లు..
గతంలో గంజాయి చాక్లెట్లను విచ్చలవిడిగా అమ్మేవారు. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్లు లభించేవి. కొన్ని కిరాణా షాపుల్లో గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయించేవారు. ప్రత్యేక పోలీస్ బృందాలు ఇలాంటి షాపులపై ఫోకస్ పెట్టి కేసులు నమోదు చేశారు. దీంతో గంజాయి చాక్లెట్ల దందా కాస్త తగ్గింది. కానీ.. కొత్తగా ఆన్‌లైన్ డెలివరీతో గంజాయి గ్యాంగ్ మళ్లీ రెచ్చిపోతోంది.
సీరియస్‌గా సర్కారు..
గంజాయి, డ్రగ్స్ విషయంలో తెలంగాణ సర్కారు సీరియస్‌గా ఉంది. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి పదాలు వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. వీటి నిర్మూలన కోసం టీ-న్యాబ్‌ను ఏర్పాటు చేసి పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీ-న్యాబ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్ నగరం సహా.. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తోంది.