Crime Partner :నవీన్ హత్య కేసులో ఆమె కూడా నిందితురాలే… దొరికిపోయిన హరి లవర్
Crime Partner సంచలనం సృష్టించిన బిటెక్ విద్యార్ది నవీన్ హత్య కేసులో అతని స్నేహితురాలు నిహారికా రెడ్డిని కూడా నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన యువతి ప్రమేయాన్ని సాంకేతిక ఆధారాలతో పోలీసులు బయటపెట్టారు. దీంతో ఆమెను కూడా కేసులో నిందితురాలిగా చేర్చారు.
Crime Partner హైదరాబాద్ అబ్లుల్లాపూర్‌మెట్‌లో సంచలనం సృష్టించిన నవీన్ హత్యకేసు నిందితుల జాబితాలో హరిహరకృష్ణ స్నేహితురాలు నిహారికా రెడ్డిని కూడా చేర్చారు. ఫిబ్రవరి 17న హత్యకు గురైన నవీన్ హత్య కేసు దర్యాప్తులో పోలీసుల్ని యువతి ముప్పతిప్పలు పెట్టింది. దీంతో సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టిన పోలీసులు ఆమె నుంచి నిజం రాబట్టారు. దర్యాప్తు ప్రారంభంలో తనకేమి తెలియదని పోలీసుల్ని మభ్య పెట్టిన యువతికి అన్ని విషయాలు ముందే తెలుసని గుర్తించారు. ఆమెతో పాటు మరో స్నేహితుడ్ని హత్య కేసులో నిందితుడిగా చేర్చారు.
హైదరాబాద్ నగర శివారులో ఇటీవల జరిగిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల జాబితాలో హరిహరకృష్ణ స్నేహితురాలు నిహారిక రెడ్డి పేరును కూడా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చేర్చారు. యువతి కోసమే నవీన్‌ను హరిహరకృష్ణ కిరాతకంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో హరిహరికృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా యువతిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ2గా హరిహరకృష్ణ స్నేహితుడు హసన్, ఏ3గా నిహారికా రెడ్డి పేరును చేర్చి, వారిని కూడా అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
హత్య చేసి పారిపోయి…
‘‘ ఫిబ్రవరి 17వ తేదీన నవీన్‌ను హరిహరకృష్ణ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అంతకు ముందే మద్యం సేవించారు. పలు ప్రాంతాల్లో తిరిగిన తర్వాత నగర శివార్లకు చేరుకున్నారు. అక్కడ యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో నవీన్‌ను గొంతు పిసికి ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేశాు.
ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేశాడు. వాటిని సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అవయవాలను హసన్‌తో కలిసి మన్నెగూడ పరిసరాల్లో పడేశారు. అక్కడి నుంచి హసన్ ఇంటికి చేరుకొని దుస్తులను మార్చుకుని, రాత్రి అక్కడే ఉండి, 18వ తేదీ ఉదయం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు.
నవీన్‌ను హత్య చేసిన విషయం ఆమెతో చెప్పి.. ఖర్చుల కోసం రూ.1500 తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఫోన్‌లో వారిద్దరితో సంప్రదింపులు జరిపాడు. 20వ తేదీ సాయంత్రం మరోసారి స్నేహితురాలి దగ్గరికి వెళ్లి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
తప్పించుకోలేక లొంగిపోయి…
21వ తేదీ నవీన్ కుటుంబ సభ్యులు హరిహరకృష్ణకు ఫోన్ చేసి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయినట్లు డీసీపీ వెల్లడించారు. ‘‘ ఖమ్మం, విజయవాడ,విశాఖలో తలదాచుకొని, 23న వరంగల్‌లోని తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు హరిహర కృష్ణ కోసం గాలిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో, వెంటనే పోలీసులకు లొంగి పోవాల్సిందిగా కుమారుడికి సూచించినట్లు వివరించారు.
24న హరిహర కృష్ణ హైదరాబాద్ వచ్చి మళ్లీ హసన్ దగ్గరికి వెళ్లాడు. హసన్, హరిహర కృష్ణ ఇద్దరూ కలిసి మన్నెగూడలో నవీన్ శరీర అవయవాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి వాటిని తిరిగి తీసుకొని హత్య చేసిన ప్రదేశానికి వచ్చి తగులబెట్టారు. ఆ తర్వాత స్నేహితురాలి ఇంటికి వెళ్లి స్నానం చేశారు. ఆ సమయంలో స్నేహితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.
అక్కడి నుంచి బయల్దేరిన హరిహరకృష్ణ నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని డీసీపీ వివరించారు. హత్య సంగతి తెలిసినా పోలీసులకు తెలియచేయకపోవడం, నిందితుడు తప్పించుకోడానికి సహకరించడం, పోలీసులను తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నించడం వంటి కారణాలతో హరిహరకృష్ణ స్నేహితుల్ని కూడా నిందితులుగా చేర్చినట్లు హైదరాబాద్ పోలీసులు వివరించారు.
అసలు ఏం జరిగిందంటే….
హత్యకు గురైన నవీన్‌తో మొదట్లో స్నేహం చేసిన యువతి ఆ తర్వాత హరిహరకృష్ణకు దగ్గరైంది. ఒకరికి తెలియకుండా మరొకరితో స్నేహాన్ని కొనసాగించింది. నవీన్‌తో ఛాట్ చేస్తున్నట్లు హరిహరకృష్ణ గుర్తించడంతో తనను వేధిస్తున్నాడని అతనికి తెలిపింది. దీంతో నవీన్‌పై పగ పెంచుకున్న హరిహరకృష్ణ పథకం ప్రకారం మిత్రుడ్ని హత్య చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా యువతి పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టింది. తనకేమి తెలియదని, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. సఖి ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. చివరకు హరిహర కృష్ణ విచారణలో నిజాలు ఒప్పుకోవడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంతో యువతి పాత్రను పోలీసులు గుర్తించారు.
సంబంధిత కథనం