Hyderabad : తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. అనుమానాలు ఎన్నో?-hyderabad police arrest fake employee at telangana secretariat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. అనుమానాలు ఎన్నో?

Hyderabad : తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. అనుమానాలు ఎన్నో?

Basani Shiva Kumar HT Telugu
Jan 30, 2025 07:23 PM IST

Hyderabad : తెలంగాణ సచివాలయం.. ఎందరో వీఐపీలు ఉండే ప్రాంతం. ముఖ్యమంత్రి మొదలు.. కీలక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అక్కడే ఉంటారు. అందుకే భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి చోట ఓ నకిలీ ఉద్యోగి ఇన్నాళ్లు తిరిగాడు. కానీ.. భద్రతా అధికారులు గుర్తించలేకపోయారు. తాజాగా అతన్ని అరెస్టు చేశారు.

భాస్కర్ రావు ఫేక్ ఐడీ కార్డు
భాస్కర్ రావు ఫేక్ ఐడీ కార్డు

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లు ఓ నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. అతని కదలికలు అనుమానంగా ఉండడంతో.. సచివాలయ సీఎస్‌వో దేవిదాస్ ఆదేశాల మేరకు.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నిఘా పెట్టారు. పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అతన్ని పట్టుకున్నారు.

yearly horoscope entry point

ఫేక్ ఐడీ కార్డుతో..

ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు.. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు సృష్టించుకున్నాడు. మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు అధికారులు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రశ్నలు ఎన్నో..

రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవిపై ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటివరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు.. ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా.. సెక్రటేరియట్‌లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా..? వీరికి ఎవరు సహకరించారు? వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మంత్రుల పేర్లు చెప్పి..

సచివాలయంలో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఫేక్ ఐడీ కార్డు వ్యవహారంలో.. ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజున భాస్కర్ రావు ఎస్పీఎఫ్ అధికారులకు పట్టుబడ్డాడు. అప్పటివరకు ఆయన్ను ఎవరూ గుర్తించలేదని తెలుస్తోంది.

కట్టుదిట్టమైన భద్రత..

2024 అక్టోబర్ వరకు సచివాలయం భద్రత బాధ్యతలను.. తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ చూసింది. ఆ తర్వాత తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌కు అప్పగించింది. కమాండెంట్‌ దేవీదాస్‌ సచివాలయ ప్రధాన భద్రతాధికారిగా నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో 212 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. వీరే కాకుండా.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు శాంతి భద్రతలు, ట్రాఫిక్‌, ఆక్టోపస్‌ క్విక్‌ రియాక్షన్‌ టీమ్ విధుల్లో ఉంటాయి.

Whats_app_banner