Hyderabad : లెహంగా పేరిట మోసం.. అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం.. జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు!-hyderabad police advises to be careful of cyber frauds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : లెహంగా పేరిట మోసం.. అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం.. జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు!

Hyderabad : లెహంగా పేరిట మోసం.. అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం.. జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు!

Basani Shiva Kumar HT Telugu
Jan 27, 2025 12:37 PM IST

Hyderabad : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త దారి వెతుక్కొని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా లెహంగా పేరిట ఓ మహిళను మోసం చేశారు. భారీ డిస్కౌంట్ పేరుతో ఈ మోసం జరిగింది. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో భారీ ఆఫర్లను నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు.

అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం
అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం (istockphoto)

అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతీ సందర్భాన్ని తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇటీవల జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పలు సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. దీన్ని ఛాన్స్‌గా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. అదే తరహాలో ప్రకటనలు ఇచ్చి మోసం చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళ ఖాతా నుంచి రూ.40 కాజేశారు.

రూ.40 వేలు కాజేశారు..

ఇన్‌స్టాగ్రామ్‌లో లెహంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. రూ.40 వేలు పోగొట్టుకుంది. జూబ్లిహిల్స్‌లో నివాసముంటున్న శ్రీవల్లి అనే మహిళ.. ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా ఓ లెహంగా కనిపించింది. దీంతో పూజా కలెక్షన్స్ పేరుతో ఉన్న పేజీలోకి వెళ్లింది. ఓ లెహంగా కోసం ఆ పేజీలో సూచించిన స్కానర్‌కు రూ.1000 చెల్లించింది.

ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే..

డబ్బులు చెల్లించి రెండు రోజులు అయ్యింది. కానీ తాను ఆర్డర్ పెట్టిన లెహంగా మాత్రం రాలేదు. దీంతో మళ్లీ ఆ పేజీలో కనిపించిన ఫోన్ నంబర్‌కు కాల్ చేసింది. ఈ సమయంలో ఖాతా తనిఖీ పేరుతో సైబర్ మోసగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.40 వేలు కొట్టేశారు. మోసపోయానని గుర్తించిన శ్రీవల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాగ్రత్తగా ఉండాలి..

ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 'భారీ డిస్కౌంట్ అంటే ఆశపడి లింక్ క్లిక్ చేయొద్దు. క్యూఆర్‌ కోడ్స్‌ స్కాన్ చేయొద్దు. మీ అత్యాశే...సైబర్ నేరగాళ్లకు ఆయుధం. తక్కువ రేటుకే వస్తువులు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రాంలో జరుగుతున్న ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండండి' అని తెలంగాణ పోలీసులు సూచించారు.

ప్రభుత్వ పథకాల పేరుతో..

ఈ మధ్య తెలంగాణలో సంక్షేమ పథకాలపై గ్రామ, వార్డు సభలు జరిగాయి. వాటిల్లో పథకాలకు సంబంధించి అర్హులు, అమర్హుల పేర్లను అధికారులు వెల్లడించారు. దీన్ని కూడా సైబర్ నేరగాళ్లు వాడుకోవాలని ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు అనర్హుల ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు పంపారు. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలకు అర్హులు అవుతారంటూ సందేశాలు పంపారు.

అనుమానం వచ్చి..

ఈ మెసేజ్‌లపై అనుమానం వచ్చి, వారు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనని, అలాంటి సందేశాల్లో వచ్చిన లింక్‌లపై చేయొద్దని ప్రజా ప్రతినిధులు ప్రజలకు వివరించారు. పొరపాటున క్లిక్ చేస్తే.. సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోతారని వివరించారు.

Whats_app_banner