Phone Tapping Case : 17 సిస్టమ్ లు, 56 మంది సిబ్బంది-1200 మంది ఫోన్ల ట్యాప్ : ప్రణీత్ రావు వాంగ్మూలం-hyderabad phone tapping case sib ex dsp praneeth rao statement 1200 members phone tapped ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping Case : 17 సిస్టమ్ లు, 56 మంది సిబ్బంది-1200 మంది ఫోన్ల ట్యాప్ : ప్రణీత్ రావు వాంగ్మూలం

Phone Tapping Case : 17 సిస్టమ్ లు, 56 మంది సిబ్బంది-1200 మంది ఫోన్ల ట్యాప్ : ప్రణీత్ రావు వాంగ్మూలం

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2024 06:42 PM IST

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నారు.

17 సిస్టమ్ లు, 56 మంది సిబ్బంది-1200 మంది ఫోన్ల ట్యాప్
17 సిస్టమ్ లు, 56 మంది సిబ్బంది-1200 మంది ఫోన్ల ట్యాప్
yearly horoscope entry point

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీస్ బాస్ లు ఒక్కొక్కరిగా నోరువిప్పుతున్నారు. రాధా కృష్ణరావు, భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్న వాంగ్మూలాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు పేర్కొన్నారు. 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాల మద్దతుదారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. అధికారికంగా 3 ఫోన్లు, అనధికారికంగా 5 ఫోన్లు మొత్తం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశామని ప్రణీత్ రావు తెలిపారు.

17 కంప్యూటర్లు 56 మంది సిబ్బంది

ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొత్తం 17 కంప్యూటర్లను వినియోగించామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో చెప్పారు. అలాగే 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని వినియోగించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ట్యాపింగ్‌ ఆపేయాలని సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు అందాయన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారని, అలాగే తన రాజీనామా ముందే అన్ని రికార్డులూ ధ్వంసం చేయాలని ఆదేశించారన్నారు. అందుకే ట్యాపింగ్ పాల్పడిన వాటిని ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చామన్నారు. రికార్డులు ధ్వంసం చేసి నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్ రావు తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఫోన్లు, పెన్ డ్రైవ్ లు ఫార్మాట్ చేసి బేగంపేట నాలాలో పడేసినట్లు చెప్పారు. సీడీఆర్‌, ఐడీపీఆర్‌ డేటా మొత్తం కాల్చేశామన్నారు.

ప్రతిపక్షాల ఆర్థిక మూలాలే లక్ష్యంగా

ప్రతిపక్షాలకు ఆర్థికసాయం అందించే వారిని లక్ష్యంగా చేసుకుని వాళ్ల డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామని ప్రణీత్ రావు తెలిపారు. పట్టుకున్న నగదును హవాలా నగదుగా రికార్డుల్లో చూపించామన్నారు. కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ కు చెందిన శ్రీనివాస్, అనంత్ సాయంతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రోజు నుంచి ట్యాపింగ్‌ని ఆపేశామని ప్రణీత్ రావు తెలిపారు.

తిరుపతన్న వాంగ్మూలం

ఈ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోవటమే లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారని సమాచారం. ఈ వ్యవహారమంతా ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు డైరెక్షన్ లోనే నడిచినట్లు తిరుపతన్న తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు. ప్రభాకర్ రావుతో పరిచయం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసినంత వరకు ఏం జరిగిందనే విషయాలను సిట్ కు వెల్లడించారు. మునుగోడు బైపోల్ సందర్భంగా ఫోన్ కాల్స్ ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో నడిచినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మీటింగ్స్ లో తాను కూడా పాల్గొన్నట్లు వివరించారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి విధులు నిర్వర్తించారనే దానిపై కూడా సిట్ ఆరా తీసింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకోవటమే లక్ష్యంగా పని చేసినట్లు తిరుపతన్న చెప్పినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్‌రావుతో కలిసి పని చేశానని తెలిపారు. ఈ టీమ్ లో కొందరు సీఐలతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం