Park Hyatt Fire Accident : హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్లకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద సమయంలో ఎస్ఆర్.హెచ్ ప్లేయర్లు హోటల్ ఆరో అంతస్తులో ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లిపోయారు. వైరింగ్ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. మంటలను ఆర్పివేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు.
బంజారాహిల్స్ పార్క్‌హయత్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్‌హయత్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన హోటల్ కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే పార్క్ హయత్ హోటల్‌లోనే హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్ సభ్యులు బస చేస్తున్నారు. ఈ హోటల్‌లోనే ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందారు. సన్‌రైజర్ టీమ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్లేయర్లు అంతా సేఫ్‌గా ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు.
హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి (DFO) తెలిపిన వివరాల ప్రకారం.. SRH టీమ్ వారి షెడ్యూల్ ప్రకారం హోటల్ నుంచి సురక్షితంగా చెక్ అవుట్ చేసింది. ఈ ప్రమాదంలో ఇతర ప్రాణనష్టం జరగలేదు. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు తమ జట్టు బస్సులో హోటల్ నుంచి బయలుదేరడం పలు వీడియోల్లో కనిపించింది.
అగ్నిప్రమాదంపై పార్క్ హయత్ హోటల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
“సోమవారం తెల్లవారుజామున హోటల్‌లో స్టీమ్ సౌనా రూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మా సిబ్బంది వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. మా అతిథులు, ఉద్యోగుల భద్రత మా ప్రధానం. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మా అతిథులకు సురక్షితమైన వాతావరణం అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇంకా SRH బృందం హోటల్‌ను ఖాళీ చేయలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాము. వారు ముంబైలో జరిగే మ్యాచ్ కోసం షెడ్యూల్ ప్రకారం బయలుదేరారు” అని పార్క్ హయత్ పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని వట్టినాగులపల్లి అగ్నిమాపక శాఖ శిక్షణా కేంద్రంలో వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులు అర్పించారు.
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు డీజీ నాగిరెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ, ప్రదర్శనలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. ఈ వారోత్సవాలు అగ్నిమాపక సిబ్బందికి ప్రేరణను కలిగించడంతోపాటు, ప్రజల భద్రతపైన అవగాహనను పెంపొందించడానికి కీలకంగా మారనున్నాయన్నారు.
సంబంధిత కథనం